గేమ్ ఛేంజర్ విడుదలకు సలార్ స్ట్రాటజీ

మెగాభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ విడుదల తేదీని లాక్ చేశారనే వార్త దిల్ రాజు వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. డిసెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్రాధమికంగా నిర్ణయం తీసుకున్నారట. ముందు సెప్టెంబర్ లో అనుకున్నారు కానీ అదే నెలలో పవన్ కళ్యాణ్ ఓజి ఫిక్సయిపోవడం, తక్కువ గ్యాప్ లో తారక్ దేవర ఉండటం లాంటి కారణాల వల్ల ఏడాది చివరే బెస్ట్ అనుకున్నారట. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్లకు తగినంత సమయం దొరుకుతుంది కాబట్టి ఇంతకన్నా ఆప్షన్ లేదని టీజర్ లో అదే డేట్ ని పెడతారని సమాచారం.

మాములుగా డిసెంబర్ కన్నా జనవరిని వసూళ్ల నెలగా భావించే అభిమానులకు ఇది కొంచెం సంతృప్తి కలిగించినా దీని వెనుక సలార్ పాటించిన వ్యూహం కనిపిస్తోంది. గత ఏడాది క్రిస్మస్ పండక్కు వచ్చిన ప్రభాస్ మూవీ డివైడ్ టాక్ లోనూ భారీ వసూళ్లు తెచ్చి చాలా ఏరియాల్లో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. కెజిఎఫ్ స్థాయిలో లేదనే కామెంట్లు వచ్చినా జనం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలివేషన్లకు, డార్లింగ్ కటవుట్ కి కలెక్షన్ల వర్షం కురిపించారు. సో గేమ్ ఛేంజర్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ప్యాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటేందుకు ఛాన్స్ అందుకున్నట్టు అవుతుంది.

అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాలి కానీ మొత్తానికీ వార్త ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారుతుంది. సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర ఉంది కాబట్టి గేమ్ ఛేంజర్ ఆ కోణంలో ఆలోచించడానికి లేదు. పైగా దిల్ రాజు తన బ్యానర్ లో తీయబోయే వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబో మూవీని పండక్కి దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఎలా చూసుకున్నా చరణ్ కొత్త సంవత్సరం ప్రారంభం ముందే వస్తాడు. గతంలో ధృవ నోట్ల రద్దు టైంలో డిసెంబర్ లోనే వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ గేమ్ ఛేంజర్ కి అలాంటి ప్రతికూల పరిస్థితులు ఉండవు కాబట్టి ఈజీగా నెగ్గేయొచ్చు.