తన పేరు వాడొద్దన్న మోహన్ బాబు

ఒకప్పుడు రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉండేవారు లెజెండరీ నటుడు మంచు మోహన్ బాబు. రాజ్యసభ్య సభ్యుడిగానూ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. చాలా ఏళ్ల నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన కొడుకు మంచు విష్ణుతో కలిసి ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం తెలిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఫీజు రీఎంబర్స్‌మెంట్ బిల్లులు ఇవ్వనందుకు చంద్రబాబు సర్కారు మీద యుద్ధం కూడా ప్రకటించారు మోహన్ బాబు.

కట్ చేస్తే ఎన్నికల తర్వాత కొంత కాలానికే ఆయన ఇన్‌యాక్టివ్ అయిపోయారు. అధికార వైసీపీతోనూ సంబంధాలు నెరపట్లేదు. తటస్థంగా ఉంటున్నారు. త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోహన్ బాబు ఇప్పుడేం స్టాండ్ తీసుకుంటారా అని అందరూ చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన రాజకీయంగా ఎవరూ తన పేరు వాడొద్దంటూ విజ్ఞప్తి చేస్తూ.. అలా చేసే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

“ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టిపెట్టగలగాలి గాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల లోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ.. ధన్యవాదాలతో మంచు మోహన్ బాబు” అని మోహన్ బాబు పేర్కొన్నారు.