ఆత్మ‌ల‌కు భ‌య‌ప‌డిన గీతాంజ‌లి టీం

చాలా ఏళ్ల కింద‌ట మంచి హిట్ అయిన గీతాంజ‌లి మూవీకి గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది పేరుతో సీక్వెల్ తీస్తూ.. ఆ సినిమా ప‌బ్లిసిటీ కోసం టీజ‌ర్ లాంచ్ వేదిక‌గా హైద‌రాబాద్ పంజాగుట్ట‌లోని శ్మశాన వాటిక‌ను ఎంచుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. సినిమా థీమ్‌కు త‌గ్గ‌ట్లు టీజ‌ర్ లాంచ్ చేయ‌డానికి శ్మ‌శానాన్ని ఎంచుకోవ‌డం లాజిక‌ల్‌గానే అనిపించినా.. ప‌బ్లిసిటీ పేరుతో వెర్రెత‌ల‌లు వేస్తున్నార‌న్న అభిప్రాయం కూడా ప‌లువురి నుంచి వ్య‌క్త‌మైంది.

రెండు రోజుల పాటు ఈ చ‌ర్చ న‌డిచాక గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది టీం ఆలోచ‌న మార్చుకుంది. టీజ‌ర్ లాంచ్ వేదిక‌ను శ్మ‌శాన వాటికలో చేయొద్ద‌ని నిర్ణ‌యించుకుంది. బ‌దులుగా హైద‌రాబాద్ సిటీలోనే సినిమా వేడుక‌లు జ‌రిగే ద‌స‌ప‌ల్లా క‌న్వెన్ష‌న్‌లో ఈవెంట్ చేయ‌డానికి డిసైడైంది.

టీజర్ లాంచ్ వేదిక‌ను మార్చ‌డంపై టీం స‌ర‌దాగానే స్పందించింది. ఆత్మ‌ల ఆత్మ గౌర‌వాన్ని, మ‌నోభావాల్ని అర్థం చేసుకుంటూ.. భ‌య‌భ్రాంతుల‌వుతున్న మా యూనిట్ స‌భ్యులల‌ను అర్థం చేసుకుంటూ.. కొంత‌మంది స్నేహితులు, పాత్రికేయుల స‌ల‌హాలు సూచ‌న‌ల‌ను గౌర‌విస్తూ టీజ‌ర్ లాంచ్ వేదిక‌ను ద‌స‌ప‌ల్లా క‌న్వెన్ష‌న్‌కు మార్చిన‌ట్లు టీం ప్ర‌క‌టించింది. శ‌నివారం సాయంత్రం 7 గంట‌ల‌కు ఈ వేడుక జ‌ర‌గ‌బోతోంది.

చావులు, శ్మ‌శానాల విష‌యంలో కామెడీ చేయ‌డం త‌గ‌ద‌ని.. జ‌నాలు త‌మ ఆప్తుల‌ను స‌మాధి చేసిన ప్రాంతం విష‌యంలో ఎమోష‌న‌ల్‌గా ఉంటార‌ని.. అలాంటి చోట‌ సినిమా వేడుక‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అనే అభిప్రాయాలు సామాజిక మాధ్య‌మాల్లోనూ వ్య‌క్తం కావ‌డంతో గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది టీం వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. ఐతే ఇప్ప‌టిదాకా చేసిన హంగామాతో సినిమాకు మంచి ప‌బ్లిసిటీ అయితే వ‌చ్చిందన్న‌ది వాస్త‌వం.