మే 9 విడుదల నుంచి తప్పుకునే అవకాశాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా కల్కి 2898 ఏడి టీమ్ తన పని తాను చేసుకుపోతోంది. 78 సెకండ్ల నిడివి ఉన్న టీజర్ శివరాత్రి పండక్కు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ఆ చిన్న వీడియోకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కథానాయిక దిశా పటానితో ఇటీవలే కీలక పాటల చిత్రీకరణ జరిపాడు దర్శకుడు నాగ అశ్విన్.
చేతిలో ఉన్నదీ కేవలం రెండున్నర నెలలే అయినప్పటికీ టార్గెట్ మిస్ కాకూడదనే ఉద్దేశంతో స్వప్న బృందం డే అండ్ నైట్ వర్క్ చేస్తోంది. ప్రభాస్ మినహాయించి మిగిలిన వాళ్లతో డబ్బింగ్ కూడా చెప్పిస్తున్నారని సమాచారం. కమల్ హాసన్ పాత్ర రెండో భాగంలో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి పార్ట్ 1కి సంబంధించి ఎక్కువ టైం అవసరం లేకుండానే ఆయన భాగాన్ని పూర్తి చేశారట. అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్ తాలూకు పార్ట్ కూడా అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు విఎఫెక్స్ ని సమాంతరంగా చేస్తూ ఆలస్యం జరగకుండా చూసుకుంటున్నారు.
సో ప్రభాస్ ఫ్యాన్స్ నిశ్చింతగా ఉండొచ్చు. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తెరవెనుక చకచకా పూర్తి చేసేస్తున్నారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చిన ఆరు నెలలకే కల్కి రిలీజ్ ఉంటుందా లేదా అనే సందేహాలకు చెక్ పడినట్టే. ఏప్రిల్ మొత్తం విపరీతమైన ప్రమోషన్ల కోసం రంగం సిద్ధమవుతోంది. భారతీయ చరిత్రలో పెద్ద ఓపెనింగ్ వచ్చే దిశగా కల్కికి పబ్లిసిటీ చేసేందుకు ప్లాన్ రెడీ చేశారని తెలిసింది. అయితే సీక్వెల్ కు సంబంధించి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏదైనా ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేయాలా లేక డైరెక్ట్ గా క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇవ్వాలనేది ఇంకా డిసైడ్ చేయలేదట.