నాలుగు వారాల్లో నాలుగు బ్లాక్‌బస్టర్లు

సంక్రాంతి తర్వాత తెలుగులో పెద్ద హిట్‌ ఏదీ రాలేదు. తమిళ సినిమాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. మామూలుగానే ఫిబ్రవరి అంటే అన్‌సీజన్‌. ఈ టైంలో క్రేజీ సినిమాలు రిలీజ్‌ కావు. చిన్న సినిమాల్లో మంచి విజయం సాధించేవి తక్కువే. కానీ ఇదే సీజన్లో వరుసగా బ్లాక్‌బస్టర్లు ఇస్తోంది మలయాళ ఇండస్ట్రీ. ఫిబ్రవరిలో మలయాళ సినిమాల డ్రీమ్‌ రన్‌ నడుస్తోంది.

ఈ నెల మొదటి వారంలో టొవినో థామస్‌ థ్రిల్లర్‌ మూవీ అన్వేషిప్పిన్‌ కండేదుం రిలీజై మంచి టాక్‌ తెచ్చుకుంది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ దిశగా అడుగులేస్తున్న సమయంలోనే రెండో వారంలో ప్రేమలు అనే మూవీ వచ్చింది. ఈ యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. రెండో వారంలోనూ హౌస్‌ ఫుల్స్‌తో రన్‌ అవుతోంది. హైదరాబాద్‌ లాంటి చోట్ల కూడా ప్రేమలు బాగా ఆడుతోంది.

ఇక మూడో వారంలో రిలీజైన మమ్ముట్టి సినిమా భ్రమయుగం బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆ సినిమాకు హౌస్‌ ఫుల్స్‌ పడుతున్నాయి. అది కూడా బ్లాక్‌బస్టరే అని తేలిపోయింది. ఈ మూడు చిత్రాలూ బాగా ఆడుతుండగా.. ఇప్పుడు ఇంకో సినిమా మలయాళ ప్రేక్షకులను మురిపిస్తోంది. అదే.. మంజుమ్మెల్‌ బాయ్స్‌. ఇందులో పేరున్న హీరోలెవరూ లేరు. ఎక్కువమంది కొత్త నటులు ప్రధాన పాత్రలు చేశారు. గురువారమే రిలీజైన ఈ థ్రిల్లర్‌ మూవీకి అదిరిపోయే టాక్‌ వచ్చింది. పాజిటివ్‌ టాక్‌ వేగంగా స్ప్రెడ్‌ అయింది. దీన్ని వంద కోట్ల సినిమాగా చెబుతున్నారు.

మొత్తానికి అన్‌ సీజన్‌ అయిన ఫిబ్రవరిలో ఒక భాషలో నాలుగు వారాల్లో నాలుగు బ్లాక్‌బస్టర్లు రావడం అరుదైన విషయమే.