ఆ సినిమాకు అక్కడా మోక్షం రాలేదు

ఈ సంక్రాంతికి తెలుగులో హనుమాన్‌ అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే.. తమిళంలో పొంగల్‌ విన్నర్‌గా నిలిచిన సినిమా అయలాన్‌. శివకార్తికేయన్‌ హీరోగా రవికుమార్‌ అనే యువ దర్శకుడు రూపొందించిన ఈ సైఫై థ్రిల్లర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒక ఏలియన్‌ భూమి మీదికి వచ్చి ఓ మానవుడితో స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో చాలా సరదాగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు రవికుమార్‌.

కొన్నేళ్లుగా శివకార్తికేయన్‌ సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజవుతున్నాయి కానీ.. సంక్రాంతి పోటీ వల్ల ఆ టైంలో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేయలేకపోయారు. రెండు వారాలు లేటుగా రిపబ్లిక్‌ డే వీకెండ్లో థియేట్రికల్‌ రిలీజ్‌ కోసం ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. తెలుగులో ఈ సినిమాకు మంచి క్రేజ్‌ కూడా కనిపించింది.

కానీ అయలాన్‌ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేయాల్సిన నిర్మాతకు ఏవో లీగల్‌ ఇష్యూస్‌ తలెత్తి తెలుగు విడుదల ఆగిపోయింది. ఉదయం థియేటర్లకు వెళ్లిన వాళ్లకు షాక్‌ తగిలింది. షోలు రద్దయ్యాయి. ఆ రోజే కాదు.. ఆ వీకెండ్లో, ఆ తర్వాత కూడా అయలాన్‌ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ కాలేదు. ఐతే హిట్టు సినిమా కదా.. ఓటీటీలోకి వచ్చినప్పుడైనా చూద్దాం అనుకున్న వాళ్లకు నిరాశ తప్పట్లేదు.

సన్‌ నెక్స్ట్‌లో కేవలం తమిళ వెర్షన్‌ మాత్రమే రిలీజ్‌ చేశారు. తెలుగు వెర్షన్‌ అక్కడ కానీ, మరో ఓటీటీలో కానీ రిలీజ్‌ కాలేదు. ఏవైనా లీగల్‌ ఇష్యూస్‌ ఉంటే థియేట్రికల్‌ రిలీజ్‌ వరకు పరిమితం కావాలి కానీ.. ఓటీటీలో కూడా సినిమా రిలీజ్‌ కాకపోవడం ఏంటో అర్థం కావడం లేదు. తెలుగులో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న శివ నుంచి ఓ పెద్ద హిట్‌ సినిమా వస్తే అది చూసే ఛాన్స్‌ మన ప్రేక్షకులకు లభించడం లేదు.