భైరవకోన దర్శకుడితో భారీ చిత్రం

స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ ఇక్కడే స్థిరపడిపోయాడు వీఐ ఆనంద్. తెలుగులో ‘హృదయం ఎక్కడున్నది’ అనే సినిమాతో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ పేరుతో ఓ సినిమా వచ్చిన సంగతి కూడా చాలామందికి తెలియదు. ఆ తర్వాత తమిళంలో ‘అప్పూచి గ్రామం’ అనే వైవిధ్యమైన సినిమాతో అతను మంచి పేరు సంపాదించాడు. ఆపై తెలుగులో వరుసగా టైగర్, ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా సినిమాలు తీశాడు.

ఇప్పుడు ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో ఒక్కక్షణం, డిస్కోరాజా మినహా సినిమాలు మంచి ఫలితాన్నే అందుకున్నాయి. ఫలితాల సంగతి పక్కన పెడితే.. వీఐ ఆనంద్ అంటే వెరైటీ సినిమాలు తీస్తాడు అనే పేరు సంపాదించాడు. ఒక దశలో అతను అల్లు అర్జున్‌తో కూడా కథా చర్చలు జరిపాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఐతే త్వరలోనే ఆనంద్ ఒక స్టార్ హీరోతో పెద్ద బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు.

‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో నిర్మాణ భాగస్వామి అయిన అనిల్ సుంకర.. ఆనంద్‌తో ఓ పెద్ద సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ రోజే ఆ ప్రాజెక్టు గురించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇందులో నటించే హీరో పేరు వెల్లడించలేదు కానీ..  ఓ పెద్ద హీరో సినిమానే అని మాత్రం హింట్ ఇచ్చారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ ఈ సినిమాను భారీ బడ్జెట్లో తీయబోతున్నట్లు కూడా ప్రకటించారు.

గత ఏడాది ఏజెంట్, భోళా శంకర్ లాంటి పెద్ద సినిమాలతో గట్టి ఎదురు దెబ్బలు తిన్న అనిల్ సుంకర.. ఆ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కథల ఎంపికలో జాగ్రత్త పడుతున్నారు. ఆనంద్ ‘ఊరు పేరు బైరవకోన’తో ఓ మోస్తరు ఫలితాన్ని అందించాడు అనిల్‌కు. అతడి కథలైతే కొంచెం కొత్తగా ఉంటాయి. ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తాయి. పెద్ద హీరోతో మంచి కథను సరిగా డీల్ చేస్తే అతను అద్భుతాలు చేయగలడు అనిపిస్తుంది. మరి దెబ్బలు మీద దెబ్బలు తింటున్న అనిల్‌కు అతనైనా ఓ పెద్ద హిట్ ఇస్తాడేమో చూడాలి.