విదేశీ డిస్ట్రిబ్యూటర్ల కోసం పుష్ప ప్లాన్

ఒక సీక్వెల్ కి మొదటి భాగం కన్నా ఎక్కువ క్రేజ్ రావడం బాహుబలి, కెజిఎఫ్ తర్వాత పుష్పకే దక్కిందని చెప్పాలి. నిజానికి పార్ట్ 1 ది రైజ్ రిలీజైనప్పుడు మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన వచ్చింది. తర్వాత పికప్ అయ్యింది. కానీ నార్త్ లో ఏ మాత్రం ఊహకందని రీతిలో భీభత్సం సృష్టించింది. ముఖ్యంగా యూట్యూబ్ కోసం డిజిటల్ హక్కులు కొన్న గోల్డ్ మైన్స్ సంస్థకి నిజంగానే బంగారు గనిగా మారిపోయింది. అక్కడి నుంచి పుష్పకు సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలే బన్నీ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ కు వెళ్లి పుష్ప 1 ప్రీమియర్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ముందు నుంచి హడావిడి లేకుండా ఎందుకిలా చేశారనే చిన్న డౌట్ అభిమానుల మనస్సులో లేకపోలేదు. దానికి అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు బలమైన కారణమే ఉందట. పుష్ప 2 ది రూల్ వచ్చే ఆగస్ట్ 15 ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేశారట. అందులో భాగంగా డిస్ట్రిబ్యూటర్లని సంప్రదించేందుకు బెర్లిన్ చిత్రోత్సవాన్ని వేదికగా మార్చుకున్నట్టు తెలిసింది. యూరోప్ తదితర దేశాల్లో పంపిణి జరగాలంటే వాళ్ళ మద్దతు చాలా కీలకం. అందుకే షో చూపించి మరీ నమ్మకాన్ని కలిగించారని వినికిడి.

అక్కడే కాదు రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని స్ట్రాటజీలు సిద్ధం చేయబోతున్నారట. ఓవర్సీస్ లో ఇప్పటిదాకా టాలీవుడ్ కు పట్టు ఉన్నది యుఎస్, యుకె, ఆస్ట్రేలియా లాంటి ప్రధాన దేశాల్లో మాత్రమే. అరబ్ కంట్రీస్ లో ఇప్పుడిప్పుడే బలపడుతోంది. మిగిలిన చోట విస్తరించాలంటే దానికి చాలా ప్లానింగ్, ఖర్చు అవసరం. పుష్ప 2 అన్నింటికీ సిద్ధ పడుతోంది. ఇప్పటికే పుష్ప 3కి సంబంధించిన వార్తలు అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. దర్శకుడు సుకుమార్ అదిరిపోయే కంటెంట్ తో అంచనాలకు మించి సీక్వెల్ ని రూపొందిస్తున్నారనే వార్త ఫ్యాన్స్ ని కుదురుగా ఉండనివ్వడం లేదు.