సందీప్ కిషనే కావాలంటున్న ధనుష్

ఇటీవలే ఊరుపేరు భైరవకోనతో డీసెంట్ సక్సెస్ అందుకునే దిశగా వెళ్తున్న సందీప్ కిషన్ కు తెలుగులో కంటే మంచి మార్కెట్, ఆఫర్లు తమిళంలో వస్తున్నాయి. ఇటీవలే కెప్టెన్ మిల్లర్ లో ధనుష్ తో కలిసి నటించి పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు కొట్టేసిన సందీప్ తిరిగి అతనితోనే ‘రాయన్’ ఆఫర్ అందుకున్నాడు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో ముగ్గురు అన్నదమ్ములు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ మాఫియాని ఎలా నడిపించారనే పాయింట్ మీద తీస్తున్నారు. ఇందులో వయొలెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్.

సందీప్ కిషన్ కు బ్రేక్ గతంలోనే వచ్చింది. లోకేష్ కనగరాజ్ తీసిన మానగరం మొదటి విజయం అందిస్తే ప్రాజెక్ట్ జెడ్ కు అవాంతరాలు ఎదురైనా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఆ తరువాత కేరాఫ్ సూర్య బైలింగ్వల్ చేశాడు కానీ విజయం సాధించలేదు. కసడ తబర ఫ్లాప్ అయ్యింది. అయినా సరే అవకాశాలకు లోటు లేకుండా పోతోంది. కెప్టెన్ మిల్లర్ లో నటన చూశాకే ధనుష్ తన రాయన్ లో కీలకమైన తమ్ముడి క్యారెక్టర్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న రాయన్ ని ఈ ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సరే ఏ భాష అయితే ఏముంది కెరీర్ లో నిలదోక్కుకోవడం ముఖ్యం. సందీప్ కిషన్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. ఊరుపేరు భైరవకోన బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్నాడు కానీ మరీ పెద్ద స్థాయికి వెళ్ళకపోవడం కొంత అసంతృప్తికి గురి చేసినా మూడు రోజుల్లో ఇరవై కోట్ల గ్రాస్ సాధించడం చిన్న విషయం కాదు. ఇప్పుడొచ్చే వీకెండ్ ని హోల్డ్ చేసుకోగలిగితే మంచి లాభాలు కళ్ళచూడొచ్చు. సందీప్ కిషన్ ప్రస్తుతం తెలుగులో కొత్త కమిట్ మెంట్లు ఇవ్వలేదు. కథలు వింటున్నాడు కానీ ఇంకా దేనికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. త్వరలోనే కన్నడ ఎంట్రీ కూడా ఉండొచ్చని అంటున్నారు.