మొన్న మలయాళంలో విడుదలైన మమ్ముట్టి భ్రమ యుగం హిట్ టాక్ సొంతం చేసుకుంది. పూర్తి బ్లాక్ అండ్ వైట్, 35 ఎంఎంలో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ ని ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నట్టు కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. కేరళలో మొదటి రోజు మూడు కోట్లకు పైగానే వసూలు కావడం దీనికి నిదర్శనం. ఎంత పెద్ద హీరో అయినా ఈ జానర్ కు కుటుంబ ప్రేక్షకులు, మాస్ దూరంగా ఉంటారు. కానీ ఒక విభిన్నమైన అనుభూతినిస్తోందనే టాక్ రావడంతో క్రమంగా థియేటర్లు ఫుల్లవుతున్నాయి. హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో రేపు రాత్రి స్పెషల్ షో వేశారంటేనే క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
అంతగా ఇందులో ఏముందో ఒక చిన్న లుక్ వేద్దాం. జానపద గాయకుడైన తేవన్ (అర్జున్ అశోకన్) అడవిలో దారి తప్పి ఓ పాడుబడిన తాతల నాటి ఇంటికి చేరుకుంటాడు. అక్కడ కుడుమోన్(మమ్ముట్టి), అతని కొడుకు (సిద్దార్థ్ భరతన్) మాత్రమే ఉంటారు. అతిథి వచ్చాడని సకల మర్యాదలు చేస్తారు. గంటలు గడిచే కొద్దీ అక్కడేదో తేడా ఉందని అర్థం చేసుకున్న తేవన్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ తాంత్రిక విద్యల్లో ఆరితేరిన కుడుమోన్ ఉచ్చులో నుంచి బయట పడలేకపోతాడు. ఆ తర్వాత జరిగే ఆసక్తికర సంఘటనలు, భీతిగొలిపే సన్నివేశాలే భ్రమ యుగం.
ఎప్పుడూ చూడని క్యారెక్టర్ లో మమ్ముట్టి విశ్వరూపం చూపించగా దర్శకుడు రాహుల్ సదాశివన్ టేకింగ్ ఆశ్చర్యపరుస్తుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ వచ్చే వారం విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఫిలిం మేకర్స్ కి ఏమో కానీ సగటు ప్రేక్షకులకు కొంచెం స్లో అనిపించే నెరేషన్ భ్రమ యుగంలోనూ ఉంది. కొన్ని భాగాలు ల్యాగ్ అయ్యాయి. కానీ ఆర్ట్ వర్క్, ఛాయాగ్రహణం, నటీనటుల పెర్ఫార్మన్స్ ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడ్డాయి. కేరళీయులకు మనకు అభిరుచుల్లో ఉన్న వ్యత్యాసం కారణంగా మనోళ్లు భ్రమ యుగంని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.