బాక్సాఫీస్ వద్ద అల్ట్రా డిజాస్టర్లుగా మిగిలిన సినిమాలు టీవీలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కించుకోవడం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. వినయ విధేయ రామ, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటివి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇవి స్టార్ హీరోలు, పెద్ద దర్శకులు చేసినవి కాబట్టి అలాంటి స్పందన వచ్చిందనుకోవచ్చు కానీ ఆదికేశవకు అలాంటి ఆకర్షణలు లేవు. మెగా కాంపౌండ్ అయినా వైష్ణవ్ తేజ్ కు ప్రత్యేకంగా ఫాలోయింగ్ లేదు. డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి కున్న అనుభవం తక్కువే. హీరోయిన్ శ్రీలీల మాత్రమే చెప్పుకోవాల్సిన ఆట్రాక్షన్. ఇటీవలే శాటిలైట్ ప్రీమియర్ జరుపుకుంది.
అనూహ్యంగా ఆదికేశవకు అర్బన్ టిఆర్పి రేటింగ్ 10.47 రావడం చూసి టీవీ వర్గాలకు నోట మాట రాకపోవడం ఒక్కటే తక్కువ. రూరల్ ని కలుపుకుంటే యావరేజ్ గా 9.87 తెచ్చుకుంది. ఈ రెండూ పెద్ద నెంబర్లే. ఎందుకంటే గత ఎనిమిది నెలల కాలంలో పెద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచిన వాల్తేరు వీరయ్య, భగవంత్ కేసరి, దసరాకు కూడా ఇంత రాలేదు. ఆదిపురుష్ సైతం 10 టచ్ చేయలేకపోయింది. అలాంటిది దారుణమైన విమర్శలకు గురైన ఆదికేశవకు ఇంత రేటింగ్ రావడం విచిత్రం. నెట్ ఫ్లిక్స్ లో ఓటిటి స్టీమింగ్ జరుపుకున్నపుడు సైతం దీన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
కారణం ఏంటయ్యా అంటే థియేటర్లో ఆదికేశవ చూసిన వాళ్ళు చాలా తక్కువ. మొదటి వారంకే డెఫిషిట్ పడితే కలెక్షన్లు ఎక్కడి నుంచి వస్తాయి. సితార లాంటి పెద్ద బ్యానర్ కావడంతో మంచి రిలీజ్ దక్కినప్పటికీ బ్యాడ్ కంటెంట్ తో ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యింది. కానీ బుల్లితెరపై సంచలనం రేపింది. ఈ లెక్కన భవిష్యత్తులో ఫ్లాప్ సినిమాలకే టీవీలో ఎక్కువ ఆదరణ ఉంటుందని అర్థమవుతోందిగా. ఇలా అయితే శాటిలైట్ డీల్స్ కాని ఫ్లాప్ మూవీస్ కి మంచి రేట్లు వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. కాకపోతే కాసింత స్టార్ అట్రాక్షన్, పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటే చాలు అమ్ముడుపోతుంది.