మొన్నటి సంవత్సరం వచ్చిన డీజే టిల్లు సంచలనాన్ని అంత సులభంగా మర్చిపోలేం. సిద్దు జొన్నలగడ్డ ఎనర్జీని పూర్తి స్థాయిలో బయట పెట్టిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా దీనికున్న కల్ట్ ఫాలోయింగ్ మామూలుది కాదు. సీక్వెల్ కోసం రెండేళ్లకు పైగా టైం పట్టినా, దర్శకుడిని మార్చాల్సి వచ్చినా వెనుకాడలేదు. సితార లాంటి పెద్ద బ్యానర్ నిర్మాణం కావడంతో క్వాలిటీ కోసం లేట్ అవుతున్నా భరిస్తూ వచ్చారు. నేహా శెట్టి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ వచ్చి గ్లామర్ షో చేయడంతో అంచనాలు మరింతగా ఎగబాకాయి. అందుకే అందరి కళ్ళు ప్రేమికుల రోజు వచ్చే ట్రైలర్ మీదే నిలిచాయి.
ఈసారి ఏకంగా 3 నిమిషాల 35 సెకండ్ల వీడియో వదలడం విశేషం. స్టోరీ పరంగా గుట్టేమి దాచలేదు. రాధిక మోసం చేసిన తర్వాత పెళ్లికి దూరంగా ఉన్న టిల్లుకి కొత్తమ్మాయి పరిచయమవుతుంది. అంతా బాగుందని ఆమెకు దగ్గరవుతున్న తరుణంలో తన బ్యాక్ స్టోరీ విని వద్దనుకుంటూనే తుపాకీ పట్టుకుని నేరస్థుల మధ్య అడుగు పెట్టాల్సి వస్తుంది. తమాషాగా మొదలైన వ్యవహారం రక్తపాతం దాకా వెళ్తుంది. హైదరాబాద్ లో ఉన్న అమ్మాయిల పంచాయితీలన్నీ తీర్చడమే తన జీవిత లక్ష్యంగా భావించే టిల్లు ఈసారి పెద్ద లొల్లిలోనే ఇరుక్కుంటాడు. అదే టిల్లు స్క్వేర్.
సిద్దు క్యారెక్టరైజేషన్ ని ఇంకా షార్ప్ గా మార్చిన దర్శకుడు మల్లిక్ రామ్ రొమాంటిక్ సీన్స్ లో డోస్ ని అమాంతం పెంచేశాడు. టిల్లు, అనుపమ మధ్య సుదీర్ఘమైన లిప్ లాక్ ముద్దు సన్నివేశాన్ని చూపించిన తీరే దానికి ఉదాహరణ. డైలాగులు ఊహించినట్టే ట్రెండీగా ఉన్నాయి. తమన్ బిజిఎం, రామ్ మిర్యాల-అచ్చు రాజమణి పాటలు మరోసారి దన్నుగా నిలుస్తున్నాయి. క్రైమ్ మోతాదుని పెంచేశారు.మార్చి 29 విడుదల కాబోతున్న టిల్లు స్క్వేర్ లో ఫస్ట్ పార్ట్ క్యాస్టింగ్ తో పాటు మురళీశర్మ లాంటి అదనపు తారాగణం పెద్దదే ఉంది. సీక్వెల్ హిట్ సెంటిమెంట్ ని టిల్లు కొనసాగించేలానే ఉన్నాడు.