సూపర్ స్టార్ ఇమేజ్ కు దారుణమైన దెబ్బ

పేరుకి క్యామియో అని చెప్పుకున్నప్పటికీ నలభై నిమిషాలకు పైగానే నిడివి ఉండటంతో లాల్ సలాంని రజినీకాంత్ సినిమాగానే పరిగణించాలి. దారుణమైన డిజాస్టర్ గా దీనికొచ్చిన వసూళ్లు, క్యాన్సిలవుతున్న షోలు చూసి అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. సరిగ్గా ఏడు నెలల క్రితం ఇదే సమయంలో జైలర్ బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపించింది. ఏపీ తెలంగాణలో భారీ వసూళ్లతో ఓ రెండు వారాల పాటు థియేటర్లను జనాలతో నింపేసింది. కానీ లాల్ సలామ్ లో రజని ఉన్నాడన్న అంశాన్ని కూడా టాలీవుడ్ ఆడియన్స్ పరిగణనలోకి తీసుకోనంత ఘోరంగా ఫెయిలయ్యింది.

మొయిద్దీన్ భాయ్ గా రజనీకాంత్ పాత్ర, దానికిచ్చిన బిల్డప్ కనీసం ఫ్యాన్స్ ని సైతం సంతృప్తి పరచలేకపోయాయి. కట్ చేస్తే ఇప్పుడు నిర్మాణంలో ఉన్న వెట్టయాన్ (తెలుగు కోసం వేటగాడు టైటిల్ పరిశీలనలో ఉంది) మీద లాల్ సలామ్ దెబ్బ పడేలా ఉందని నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. తమిళనాడు సంగతేమో కానీ మన దగ్గర మాత్రం ఆశించినంత భారీ రేట్ దక్కకపోవచ్చని బయ్యర్ల అభిప్రాయం. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ మరీ ఎగబడి కొనే స్థాయిలో పరిస్థితి ఉంటుందా అంటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

లాల్ సలామ్ కు తెలుగులో పట్టుమని కోటి రూపాయల షేర్ కూడా వసూలు కాకపోవడం లాల్ సలామ్ దుస్థితికి నిదర్శనం. వెట్టయాన్ నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. దీపావళి విడుదలను అఫీషియల్ గా లాక్ చేసుకున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా ప్రమోషన్ చేయబోతున్నారు. రిటైర్ అయిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా రజని పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. అధిక శాతం షూటింగ్ హైదరాబాద్ లోనే చేశారు. ప్రస్తుతం కొనసాగుతోంది. మొయిద్దీన్ చేసిన గాయం మానే స్థాయిలో వెట్టయాన్ ప్రమోషన్లు చేస్తే తప్ప అంచనాలు పుట్టించడం కష్టం.