అంచనాలకు అందని మహేష్ రాజమౌళి లెక్కలు

ఇంకా షూటింగ్ మొదలుకాకుండానే మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ప్యాన్ వరల్డ్ సినిమాకు సంబంధించిన చర్చలు అభిమానుల్లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనూ జోరుగా జరుగుతున్నాయి. సెంథిల్ ని కాదని పిఎస్ వినోద్ కు ఛాయాగ్రహణం భాద్యతలు ఇవ్వడం పట్ల ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. సెంథిల్ త్వరలో డైరెక్టర్ గా మారబోతున్నాడని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మార్పుకు కారణం ఇదేననే ప్రచారం తిరుగుతోంది. గుంటూరు కారంకు కొంత భాగం షూట్ చేసిన వినోద్ ఆ తక్కువ గ్యాప్ లోనే మహేష్ ని ఇంప్రెస్ చేశాడనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోంది.

అందుకే తన రికమండేషన్ మీదే రాజమౌళి ఎస్ చెప్పి ఉండొచ్చని అంటున్నారు. విక్రమ్ వేదా, అల వైకుంఠపురములో, సూపర్ డీలక్స్, ధృవ లాంటి ఎన్నో బెస్ట్ వర్క్స్ పీఎస్ వినోద్ ఖాతాలో ఉన్నాయి. ఇక విఎఫెక్స్ బాధ్యతలు శ్రీనివాస్ మోహన్ నుంచి కమల్ కన్నన్ చేతికి వెళ్లడం కూడా హాట్ టాపిక్కే. మగధీర, ఈగకు పని చేసిన బాండింగ్ తర్వాత బాహుబలి, ఆర్ఆర్ఆర్ కు కొనసాగలేదు. ఈ రెండు శ్రీనివాస్ కు ఇచ్చారు జక్కన్న. ఈ ముఖ్యమైన మార్పులకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టి వివరాలు వెల్లడిస్తారో వేచి చూడాలి.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు, వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. క్యాస్టింగ్ ఫైనలయ్యాక డేట్లు ఖరారు చేసుకుని ఆ తర్వాత మీడియాకు రిలీజ్ చేస్తారు. రెండేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు కానీ అది ఎంతమేరకు సాధ్యమవుతుందో పరిస్థితులను బట్టి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సైతం పక్కా ప్లానింగ్ చేసుకున్నారు కానీ కరోనా వల్ల ఆలస్యం తప్పలేదు. ఈసారి ఎలాంటి అవాంతరాలు రాకపోతే 2027లో మహేష్ బాబు 29ని తెరమీద చూసే ఛాన్స్ ఉంది. ఎప్పటిలాగే అనౌన్స్ మెంట్ లోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట.