చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు రిలీజ్ ఒకట్రెండు రోజులు ఉండగానే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం ఇప్పుడు ట్రెండుగా మారింది. ఇది ఆయా చిత్ర బృందాల కాన్ఫిడెన్స్‌ను తెలియజేస్తుంది. ఇలా చేయడం వల్ల ప్రేక్షకులు ఆ సినిమాపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రిమియర్స్‌కు పాజిటివ్ టాక్ వస్తే అది ఓపెనింగ్స్‌కు బాగా కలిసొస్తోంది.
గత ఏడాది సామజవరగమన, బేబీ లాంటి సినిమాలకు పెయిడ్ ప్రిమియర్స్ బాగా ప్లస్ అయ్యాయి. ఈ నెల మొదట్లో వచ్చిన ‘అంబాజీపేట మ్యారేజీబ్యాండు’ కూడా వీటి వల్ల ప్రయోజనం పొందింది. ఇప్పుడు సందీప్ కిషన్ సినిమా ‘ఊరు పేరు భైరవకోన’ టీం కూడా ఈ ట్రెండును కొనసాగిస్తోంది. విడుదలకు రెండు రోజుల ముందే, వేలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాకు పెయిడ్ ప్రిమియర్స్ ప్లాన్ చేశారు.
సందీప్ కిషన్ కొంచెం ఇమేజ్ ఉన్న హీరో. పైగా ఈ మధ్య తెలుగులో ఫాంటసీ థ్రిల్లర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఊరు పేరు భైరవకోన’ పెయిడ్ ప్రిమియర్స్‌కు అనుకున్న దానికంటే మంచి స్పందనే కనిపిస్తోంది. పెట్టిన షోలు పెట్టినట్లే సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్, శ్రీరాములు, విశ్వనాథ్, ప్రసాద్ ఐమాక్స్.. ఇలా ప్రముఖ థియేటర్లు ఒకదాని తర్వాత ఒకటి షోలు ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్కటిగా సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. ఈ డిమాండ్ చూసి ఒక్కొక్కటిగా ప్రిమియర్ షోలు పెరుగుతున్నాయి. విజయవాడ, వైజాగ్, తిరుపతి లాంటి ఏపీ సిటీస్‌లో కూడా ఈ సినిమాకు పెయిడ్ ప్రిమియర్స్ పడుతున్నాయి. వాటికి స్పందన బాగుంది. ఈ షోలకు పాజిటివ్ టాక్ రావాలే కానీ సినిమా పెద్ద హిట్టయ్యేలా కనిపిస్తోంది.