చరణ్ ఫ్యాన్స్ ఆందోళన రెహమాన్ గురించే

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే పదహారో సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర స్లాంగ్ ని మాట్లాడే వాళ్ళ కోసం భారీ ఆడిషన్లు చేస్తున్న టీమ్ ప్రస్తుతం శ్రీకాకుళంకు అదే పని మీద వెళ్తోంది. మహా అయితే ఇంకో నెల లేదా రెండు నెలల్లో చరణ్ కు గేమ్ ఛేంజర్ నుంచి విముక్తి దక్కేలా ఉంది. దర్శకుడు శంకర్ ఆ మేరకు హామీ ఇచ్చాడట. ఆయన విడుదల చేస్తే కానీ చరణ్ నెక్స్ట్ మూవీకి కావాల్సిన మేకోవర్ చేసుకోలేడు. అందుకే ఆలస్యమవుతోంది. అయితే చరణ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న విషయం మరొకటుంది.

అదే ఏఆర్ రెహమాన్ సంగీతం. ఇటీవలి కాలంలో ఈయన బాగా నిరాశపరుస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్, లాల్ సలామ్ లాంటి భారీ చిత్రాలకు ఎవర్ గ్రీన్ అనిపించే ఆల్బమ్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ లెజెండరీ చేతిలో పదకొండు పైగానే సినిమాలున్నాయి. ధనుష్ 50, పృథ్విరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్, మణిరత్నం కమల్ హాసన్ థగ్ లైఫ్, జయం రవి – నిత్య మీనన్ కాంబో, విజయ్ సేతుపతి గాంధీ టాక్స్, జయం రవి నటించిన జిని,బాలీవుడ్ మూవీస్ చంకీలా, తేరే ఇష్క్ మే, మైదాన్ వగైరాలన్నీ నిర్మాణంలో ఉన్నవే. బాబ్ అనే అరబిక్ చిత్రం కూడా రెహమాన్ ఖాతాలో ఉంది.

ఇంత ఒత్తిడి మధ్య 57 ఏళ్ళ రెహమాన్ నుంచి బెస్ట్ రాబట్టుకోవడం అంత సులభం కాదు. పైగా టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాల విషయంలో ఈయన ట్రాక్ రికార్డు పెద్ద ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో బుచ్చిబాబుకి బెస్ట్ ట్యూన్స్ దక్కించుకోవడం పెద్ద సవాలే. ఉప్పెనకు దేవిశ్రీ ప్రసాద్ ఎంత బలంగా నిలబడ్డాడో చూశాం. ఇప్పుడు అంతకు మించిన సపోర్ట్ రెహమాన్ నుంచి రావాలి. అసలే ఊర మాస్ పల్లెటూరి బ్యాక్ డ్రాప్. ఇలాంటి వాటికి నేటివిటీ మ్యూజిక్ చాలా కీలకం. రెహమాన్ మరి ఎలాంటి అవుట్ ఫుట్ ఇస్తాడో వేచి చూడాలి. ఓ రెండు పాటలు ఆల్రెడీ ఇచ్చేశారని టాక్ ఉంది.