సినిమాలకు సంబంధించి సమ్మర్ సీజన్ సాధారణంగా మార్చి నెలాఖర్లో మొదలవుతుంటుంది. మార్చి మూడో వారానికి ఇంటర్ పరీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాత వేర్వేరు తరగతుల విద్యార్థులు పరీక్షలు ముగించుకుని సినిమాల వైపు మళ్లుతారు. ఏప్రిల్లో బాక్సాఫీస్ పూర్తి స్థాయిలో ఊపందుకుంటుంది. ఫిబ్రవరి మధ్య నుంచి మార్చి మూడో వారం వరకు అన్ సీజన్‌గానే భావిస్తారు. ఆ సమయంలో కొత్త సినిమాలకు వసూళ్లు ఆశించిన స్థాయిలో ఉండవు. అందుకే క్రేజున్న సినిమాలను ఆ టైంలో రిలీజ్ చేయరు.
కానీ కరోనా తర్వాత లెక్కలు మారి.. ఈ అన్ సీజన్ అనుకునే రోజుల్లోనూ మిడ్ రేంజ్ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈసారి కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఈ ఏడాది టాలీవుడ్లో వేసవి సందడి చాలా ముందుగానే మొదలైపోతోంది.
ఫిబ్రవరిలో ఈగల్, ఊరు పేరు భైరవ కోన లాంటి క్రేజున్న సినిమాలు థియేటర్లను కళకళలాడించేలా కనిపిస్తున్నాయి. మూడు, నాలుగు వారాల్లో కొంచెం బాక్సాఫీస్ డల్లుగా మారబోతోంది. కానీ మార్చి ఆరంభం నుంచి వేసవి విందు మొదలైపోనుంది. తొలి వారమే ఆపరేషన్ వాలెంటైన్ లాంటి పేరున్న సినిమా విడుదల కాబోతోంది. ఇది తెలుగు, హిందీ భాషల్లో పెద్ద స్థాయిలోనే రిలీజ్ కానుంది. తర్వాతి వారం గోపీచంద్ మాస్ మూవీ భీమా రానుంది. దీనికి తోడుగా విశ్వక్సేన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేసిన గామి విడుదల కానుంది. అతడి సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రావాల్సిన రోజుకే గామిని ఫిక్స్ చేశారు. ఆ వీకెండ్లో సినీ ప్రియులకు మంచి విందు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. మరోవైపు మార్చిలోనే టిట్లు స్క్వేర్ లాంటి క్రేజీ మూవీ విడుదల కాబోతోంది. ఇక ఏప్రిల్, మే నెలల్లో అయితే పెద్ద సినిమాల సందడి వేరే స్థాయిలోనే ఉండబోతోంది.