ఎంత పెద్ద నిర్మాణ సంస్థ అయినా సరే.. ఏ రేంజిలో తీసినా, ఎంత ప్రణాళికతో పని చేసినా ఏడాదికి ఐదారుకు మించి సినిమాలు రిలీజ్ చేయడం కష్టం. అలాంటిది ఒక సంస్థ నుంచి ఒక్క ఏడాదిలో 15 సినిమాల రిలీజ్ అంటే షాకవ్వాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈ ఏడాది 15 సినిమాలు రాబోతున్నాయట. ఈ విషయాన్ని ఆ సంస్థ అధినేత టి.జి.విశ్వప్రసాదే స్వయంగా వెల్లడించారు. తమ సంస్థలో ప్రస్తుతం 40 సినిమాలు మేకింగ్ దశలో ఉన్నట్లు ఆయన చెప్పడం విశేషం. వీలైనంత త్వరగా వంద సినిమాల మైలురాయిని అందుకోవాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు.
‘‘మేం నిర్మించిన సినిమాలు ఈ ఏడాది మొత్తం 15 విడుదలవుతాయి. అందులో ఒకట్రెండు ఓటీటీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సగటున నెలకొక సినిమా రిలీజ్ చేస్తాం. మా సంస్థలో ప్రస్తుతం 40 సినిమాల దాకా మేకింగ్ దశలో ఉన్నాయి. వేగంగా వంద సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నాం. ఈటీవీ విన్ సంస్థతో కలిసి కొన్ని సినిమాలు తీస్తున్నాం’’ అని విశ్వప్రసాద్ తెలిపారు.
ప్రభాస్‌తో తాము తీస్తున్న ‘రాజా సాబ్’ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నామని.. ఐతే దాని కోసం బెర్తు బుక్ చేయాల్సిన పని లేదని.. ప్రభాస్ సినిమా అంటే ఆటోమేటిగ్గా ఒక బెర్త్ ఉంటుందని విశ్వప్రసాద్ తెలిపారు. ఈ నెల 9న రిలీజవుతున్న తమ సినిమా ‘ఈగల్’ పెద్ద సక్సెస్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.