రాధేశ్యామ్ దర్శకుడు.. మళ్లీ భారీగానే

‘జిల్’ అనే స్టైలిష్ యాక్షన్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాధాకృష్ణ కుమార్. చంద్రశేఖర్ యేలేటి శిష్యరికం నుంచి వచ్చిన ఈ యువ దర్శకుడు తొలి సినిమాలో బాగానే టాలెంట్ చూపించాడు. కాకపోతే ఓవర్ బడ్జెట్ వల్ల ఆ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అయింది.

తొలి సినిమా కమర్షియల్ రిజల్ట్ గురించి ఆలోచించకుండా దర్శకుడి ప్రతిభను గుర్తించి అతడితో సినిమా చేశాడు ప్రభాస్. వీరి కలయికలో రూపొందిన ‘రాధేశ్యామ్’ మీద నిర్మాతలు ఏకంగా 300 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు. కానీ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో రిజల్ట్ తేడా కొట్టింది. ఈ సినిమాకు కూడా ఓవర్ బడ్జెట్ పెద్ద సమస్యగా మారింది. ఐతే ఈ రిజల్ట్ తర్వాత రాధాకృష్ణ కొంచెం తగ్గి పరిమిత బడ్జెట్లో సినిమా చేస్తాడని అనుకున్నారు. కానీ అతను మళ్లీ నిర్మాతలతో రిస్క్ చేయిస్తున్నట్లు సమాచారం.

రాధాకృష్ణ తన తొలి చిత్ర హీరో గోపీచంద్‌తో తన మూడో సినిమా చేయబోతున్నాడు. అతడి తొలి రెండు చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన యువి క్రియేషన్స్ సంస్థే మళ్లీ అతడికి ఛాన్స్ ఇస్తోంది. రాధాకృష్ణ-గోపీచంద్ కలయికలో ఈసారి రాబోయేది యుద్ధ నేపథ్యంలో తెరకెక్కే సినిమా అట. ఈ చిత్రాన్ని దేశ విదేశాల్లోని భారీ లొకేషన్లలో చిత్రీకరించనున్నారట. మేజర్ పోర్షన్స్ విదేశాల్లోనే తీస్తారట. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.

గోపీచంద్ సరైన హిట్టు కొట్టి చాలా ఏళ్లు అయిపోయింది. అతడి చివరి సినిమా ‘రామబాణం’ దారుణమైన ఫలితాన్నందుకుంది. త్వరలోనే అతను ‘భీమ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోవైపు శ్రీను వైట్ల దర్శకత్వంలోనూ అతనో సినిమా చేస్తున్నాడు. రాధాకృష్ణ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనున్నట్లు తెలిసింది.