అర్జున్ రెడ్డి.. తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టింగ్ సినిమాల జాబితా తీస్తే అందులో కచ్చితంగా ఉండే చిత్రం. ఒక కథను నరేట్ చేయడంలో, ఒక పాత్రను ప్రెజెంట్ చేయడంలో సందీప్ రెడ్డి వంగ ఎంచుకున్న మార్గం అప్పటిదాకా ఏ సినిమాలో చూడనిది.
రామ్ గోపాల్ వర్మ ‘శివ’ తరహాలో బలమైన ఇంపాక్ట్ చూపించిన సినిమాల్లో ఇదొకటి. ఈ చిత్రంతో దర్శకుడు సందీప్ రెడ్డి ఎంత బలమైన ముద్ర వేశాడో.. హీరోగా విజయ్ దేవరకొండ కూడా అదే స్థాయిలో ప్రత్యేకతను చాటుకున్నాడు. మామూలుగా అయితే ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేం. విజయ్ కోసమే పుట్టిన పాత్రలా అనిపిస్తుంది అర్జున్ రెడ్డి. ఐతే ఆ పాత్రకు ముందు తాను అనుకున్న నటుడు వేరు అని సందీప్ రెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ పాత్రను రాసినట్లు అతను వెల్లడించాడు.
ఇంతకుముందే ఒకసారి ‘అర్జున్ రెడ్డి’ కోసం బన్నీని అనుకున్నట్లు వెల్లడించిన సందీప్.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడాడు. బన్నీని ఊహించుకుంటూనే ఆ పాత్ర, కథ మొత్తం రాసినట్లు తెలిపాడు. బన్నీని కలిసి ఈ కథ చెప్పాలని ప్రయత్నించానని.. కానీ కుదరలేదని అతనన్నాడు.
అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ అదరగొట్టినప్పటికీ.. బన్నీ ఆ పాత్ర చేసి ఉంటే కమర్షియల్‌గా అది ఇంకా పెద్ద సక్సెస్ అయి, బన్నీ కెరీర్లో అదొక కల్ట్ క్యారెక్టర్ అయ్యుండేది అనడంలో సందేహం లేదు. మరోవైపు ‘అర్జున్ రెడ్డి’ సక్సెస్ తర్వాత బన్నీని కలిసి తాను వేరే కథ ఒకటి చెప్పినట్లు కూడా సందీప్ తెలిపాడు.
తమ కలయికలో కచ్చితంగా సినిమా ఉంటుందని.. బన్నీ కోసం ఒక ప్రత్యేకమైన కథ రాస్తానని అతనన్నాడు. ఇటీవలే ‘యానిమల్’ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్.. ప్రస్తుతం ప్రభాస్‌తో తీయబోయే ‘స్పిరిట్’ మీద ఫోకస్ పెట్టాడు. అది పూర్తయ్యాక ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ ఉంటుంది. అది కూడా అయ్యాక బన్నీతో సందీప్ జత కట్టే అవకాశముంది.