ఫ్లాపుని సమర్ధించుకోవడానికి విచిత్రమైన లాజిక్

హృతిక్ రోషన్ లాంటి స్టార్ ఉన్నా, రిపబ్లిక్ డే లాంటి మంచి సీజన్ లో రిలీజైనా ఆశించిన స్థాయిలో ఫైటర్ బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేయలేకపోయింది. ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబట్టినా ఇండియాలో మాత్రం ఫ్లాప్ వైపే పరుగులు పెడుతోంది. యావరేజ్ గా ముద్రపడ్డ టైగర్ 3 దాటుతుందనుకుంటే ఛాన్స్ లేదంటున్నారు విశ్లేషకులు. గత ఏడాది ఇదే సమయంలో పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి బాలీవుడ్ కి ఊపిరి పోసిన దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ నుంచి ఈ అవుట్ ఫుట్ ని ట్రేడ్ ఊహించలేదు. ఫెయిల్యూర్ కి ఆయన చెబుతున్న కారణాలు బహు విచిత్రంగా ఉన్నాయి.

భారతదేశంలో 90 శాతం జనాభాకు విమానం ఎక్కిన అనుభవం ఉండదు కాబట్టి తన కాన్సెప్ట్ ని అర్థం చేసుకోలేకపోతున్నారని సెలవిచ్చాడు. గాలిలో తరచుగా ప్రయాణం చేసే వారికి తాను గగనతలంలో చూపించిన యాక్షన్ లోని ఎమోషన్ కనెక్ట్ అవుతుందని గొప్ప నిర్వచనం ఇచ్చాడు. అంటే సిద్దార్థ్ లాజిక్ ప్రకారం ఫ్లైట్ టికెట్ ధరలు మధ్యతరగతి జనాలు కొనలేనంత భారీగా ఉన్నాయి. చేతిలో ఓ రెండు వేలు ఉంటే చాలు నగరాల మధ్య తిరిగే వెసులుబాటు ఉన్న రోజుల్లో ఫ్లైట్ ఎక్స్ పీరియన్స్ మరీ ఖరీదైన వ్యవహారంలా లేదిప్పుడు. అందుకే ఎయిర్ పోర్ట్స్ కిక్కిరిసిపోతున్నాయి.

ఇది మర్చిపోయి కేవలం ఆడియన్స్ ని తప్పుబట్టే ప్రయత్నం చేయడం కామెడీనే. ఆ మాటకొస్తే ఇదే బ్యాక్ డ్రాప్ లో వచ్చిన అక్షయ్ కుమార్ ఎయిర్ లిఫ్ట్, నాగార్జున గగనం లాంటి విజయం సాదించినవి ఎన్నో ఉన్నాయి. మన కంటెంట్ తేడా కొట్టి పబ్లిక్ తిరస్కరిస్తే దాన్ని సమర్ధించుకోవడానికి కొత్త డిఫినెషన్లు ఇవ్వడం అసలు కామెడీ. దీపికా పదుకునే, అనిల్ కపూర్ స్టార్ క్యాస్టింగ్ ఉన్నా బిసి సెంటర్స్ లో ఫైటర్ దారుణ తిరస్కారానికి గురయ్యింది. మరీ బ్యాడ్ మూవీ కాదు కానీ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేకపోవడం వల్ల వచ్చిన ఫలితమిది. పోటీ లేకపోయినా ప్రయోజనం దక్కలేదు.