రజినీకాంత్ సినిమాకు ఇలాంటి పబ్లిసిటా

వచ్చే వారం 9న లాల్ సలామ్ విడుదల కాబోతోంది. తెలుగులోనూ అదే రోజు డబ్బింగ్ వెర్షన్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈగల్ కి సోలో డేట్ ఇవ్వాలని ఫిలిం చాంబర్ చేసిన విన్నపానికి తమకు తక్కువ స్క్రీన్లు చాలని లైకా టీమ్ చెప్పడంతో దారి క్లియర్ అయ్యింది. ప్రమోషన్లు వాళ్ళ రాష్ట్రంలో బాగానే చేసుకుంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అందులో దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ తండ్రి గొప్పదనం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకోవడం, విజయ్ ప్రస్తావన తెచ్చి మరీ రజని అతన్ని మెచ్చుకోవడం జనాల్లోకి బాగా వెళ్లాయి. కానీ మన దగ్గర సీన్ రివర్స్ ఉంది.

ఇక్కడి ఆడియన్స్ లో లాల్ సలామ్ మీద ఆసక్తి కనిపించడం లేదు. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంది. భారీ ఎత్తున లాభాలు ఇవ్వడంతో టాలీవుడ్ లో తలైవర్ ఇమేజ్ తగ్గలేదని ఋజువయ్యింది. కానీ నెక్స్ట్ సినిమాకు సరైన రీతిలో పబ్లిసిటీ వచ్చేలా చేయడంలో నిర్మాతలు విఫలమవుతున్నారు. నిజానికి రజనీకాంత్ చేసింది గెస్ట్ రోల్. కాకపోతే నిడివి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుందట. పెదరాయుడు తరహాలో అరగంట అయినా గుర్తుండిపోయేలా క్యారెక్టర్ ని డిజైన్ చేశారని ఇన్ సైడ్ టాక్. ఈ పాయింట్ జనాలకు రీచ్ కావడం లేదు.

ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన లాల్ సలామ్ క్రికెట్ స్పోర్ట్స్ డ్రామా. నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించడం విశేషం. ఈగల్, యాత్ర 2లతో పోటీ వల్ల లాల్ సలామ్ కు ఇక్కడి వ్యవహారం అంత సులభంగా ఉండదు. చెప్పుకోదగ్గ ఆకర్షణలు ఉన్నా వాటిని ఆడియన్స్ దాకా తీసుకెళ్తేనే ఓపెనింగ్స్ వస్తాయి. ఈగల్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఈ డబ్బింగ్ మూవీకి చిక్కులు తప్పవు. లాల్ సలామ్ మెయిన్ హీరో విష్ణు విశాల్ కు ఇక్కడ మార్కెట్ లేకపోవడం కూడా హైప్ ని ప్రభావితం చేస్తోంది.