కేసు వేసిన శ్రీమంతుడు రచయిత ఏమంటున్నారు

శ్రీమంతుడు కథ వివాదంలో సుప్రీమ్ కోర్టులోనూ చుక్కెదురైన దర్శకుడు కొరటాల శివకు ఈ చిక్కు ఇప్పట్లో వదిలేలా లేదు. కేసు వేసి ఏళ్ళ తరబడి పోరాడుతున్న రచయిత శరత్ చంద్ర మెల్లగా మీడియా కెమెరా ముందుకు వస్తున్నారు. ఒక యుట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలనాత్మక విషయాలు చెప్పుకొచ్చారు. వాటి సారాంశం ఇది. శరత్ చంద్ర స్వాతి మాస పత్రిక కోసం చచ్చేంత ప్రేమ నవలను రాశారు. అది ప్రచురితమయ్యాక మంచి పేరు తీసుకొచ్చింది. శ్రీమంతుడు రిలీజయ్యాక అచ్చం నీ కథలాగే ఉందని మిత్రులు చెప్పడంతో సినిమా చూసి షాక్ తిన్నారు.

తన రచనలో దేవరకొండ ఊరి పేరుని దేవరకోటగా మార్చడం మినహాయించి అసలు పాయింట్ మొత్తం యథాతథంగా తీసుకున్నారని వివరించారు. మిత్రుడు చంద్రశేఖర్ ఆజాద్ సలహా మేరకు పరుచూరి గోపాలకృష్ణగారిని కలవడం, రచయితల సంఘం పుస్తకాన్ని పరిశీలించి చాలా సారూప్యతలు ఉన్నాయని గుర్తించడం వల్లే తెలంగాణ కోర్టులో సానుకూలంగా తీర్పు వచ్చింది. ఆ సమయంలో పది పదిహేను లక్షలు తీసుకుని రాజీ పడమని రాయబారం నడిపినా శరత్ చంద్ర ఒప్పుకోలేదు. సమస్య రాకుండా ఉండేందుకు శ్రీమంతుడులో భాగస్వామ్యాన్ని నమ్రత వేరొకరికి బదిలీ చేశారట.

మేధోచౌర్యాన్ని భరించలేక దీని మీద పోరాడుతున్నానని శరత్ చంద్ర అంటున్నారు. క్రిమినల్ ఛార్జ్ ఉంది కాబట్టి కొరటాల శివ జైలుకు వెళ్లడం ఖాయమని నొక్కి చెబుతున్నారు. తాను డబ్బుల కోసం ఇదంతా చేయలేదని, హృతిక్ రోషన్ తో రీమేక్ చేయాలని ప్రయత్నించినప్పుడూ తనకు క్రెడిట్ ఇవ్వమని అడిగానని, దానికీ ఒప్పుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈయన వైపు వెర్షన్ స్పష్టంగానే ఉంది కాబట్టి ఇప్పుడు కొరటాల శివ ఏమంటారనేది కీలకంగా మారుతోంది. దేవర ఒత్తిడి ఒకవైపు నలుపుతుండగానే ఇంకోపక్క ఎనిమిదేళ్ల నాటి కేసు వెంటాడుతూ ఉండటం బ్యాడ్ లక్.