గద్దలకొండ గణేష్ తర్వాత గ్యాప్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ తో తిరిగి ట్రాక్ లో పడిన దర్శకుడు హరీష్ శంకర్ ఏపీ ఎలక్షన్ల వల్ల పవన్ కళ్యాణ్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో రవితేజతో మిస్టర్ బచ్చన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ రీమేక్ గా రూపొందుతున్న ఈ హీస్ట్ థ్రిల్లర్ ని వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదింకా పూర్తి కాకుండానే హరీష్ శంకర్ మరో మెగా జాక్ పాట్ కొట్టేసినట్టు ఇండస్ట్రీ టాక్. చిరంజీవి హీరోగా సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ దక్కిందని సమాచారం.
దీని వెనుక బ్యాకెండ్ స్టోరీ ఉంది. భోళా శంకర్ టైంలో చిరంజీవి దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమాకు ఓకే చెప్పారు. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ తో స్క్రిప్ట్ రాయించారు. బ్రో డాడీ రీమేకనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ తర్వాత మనసు మార్చుకుని దాన్ని పక్కన పెట్టేశారు. తక్కువ బడ్జెట్ కావడంతో ముందు సుస్మిత సింగల్ ప్రొడ్యూసర్ కార్డుతో తీయాలని ప్లాన్. ఇప్పుడు సమీకరణాలు మారిపోయి హరీష్ శంకర్ వచ్చి చేరాక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీని జాయింట్ పార్ట్ నర్ గా చేర్చినట్టు తెలిసింది. మిస్టర్ బచ్చన్ నిర్మాతలు వాళ్లే కావడంతో లింకులు ముడిపడి ఇలా కాంబో సెట్ అయ్యింది.
అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు కాబట్టి కొద్దిరోజులు వేచి చూడాలి. చిరు క్యాస్టూమ్ డిజైనర్ గా సుస్మిత ఖైదీ నెంబర్ 150 నుంచి ప్రతి సినిమాకు ఆ బాధ్యతను తానే నిర్వహిస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై శ్రీదేవి శోభన్ బాబు తీసినప్పటికీ అది మరీ దారుణంగా డిజాస్టర్ కావడం ఊహించలేదు. నాన్నతో తీస్తే ఒకేసారి మార్కెట్, బ్రాండ్ రెండూ పెరుగుతాయి కాబట్టి తండ్రి వద్ద ఈ ప్రాజెక్టు నెలల తరబడి ప్లానింగ్ లో ఉంచింది. మరి ప్రసన్న రాసిచ్చిన స్క్రిప్ట్ నే హరీష్ శంకర్ తీస్తాడా లేక వేరే ఫ్రెష్ సబ్జెక్టు రాసుకున్నాడా అనేది ఇంకొంత కాలం ఆగితే క్లారిటీ వస్తుంది.