దర్శకుడు కొరటాల శివ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన శ్రీమంతుడు రిలీజై ఎనిమిదేళ్లవుతున్నా దాని వివాదం మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది. 2015లో ఈ సినిమా విడుదలైన కొన్ని నెలలకు శరత్ చంద్ర అనే రచయిత స్వాతి పత్రికలో వచ్చిన తన కథను ఆధారంగా చేసుకునే చిత్రాన్ని తీశారని కేసు వేయడం అప్పట్లో సంచలనం రేపింది. విచారించిన నాంపల్లి కోర్టు రచయితల సంఘం సమర్పించిన నివేదికను ఆధారంగా చేసుకుని కాపీ నిజమేనని భావిస్తూ క్రిమినల్ చర్యలను ఎదురు కోవాలని ఆదేశించింది. దీని మీద కొరటాల శివ తర్వాత తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు.
అక్కడా చుక్కెదురు వచ్చింది. నాంపల్లి న్యాయస్థానం తీర్పుని హైకోర్టు సమర్ధించడంతో వ్యవహారం ఇంకాస్త ముదిరింది. దీంతో కొరటాల శివ ఏకంగా సుప్రీమ్ కోర్టుకి వెళ్లారు. శరత్ చంద్ర ఆలస్యంగా స్పందించారని, తమ వాదనను స్థానిక కోర్టులు వినలేదని శ్రీమంతుడు దర్శకుడి తరఫున వాదించిన నిరంజన్ రెడ్డి ఆర్గుమెంట్ ని ధర్మాసనం తిరస్కరించింది. దీంతో కేసుని డిస్మిస్ చేయాలా లేక మీరే వెనక్కు తీసుకుంటారా అని న్యాయమూర్తులు ప్రశ్నించినప్పుడు వాపస్ కే కొరటాల మొగ్గు చూపడంతో బాల్ మళ్ళీ తెలంగాణ కోర్టుకి వచ్చి చేరింది. ఇప్పుడేం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
నిజానికి ఈ ఇష్యూ జరిగినప్పుడు కొరటాల, సదరు రచయిత మ్యాటర్ సెటిల్ చేసుకున్నారనే టాక్ వినిపించింది కానీ అది నిజం కాదని తర్వాత తేలిపోయింది. శ్రీమంతుడులో ఊరిని ఒక ధనవంతుడి అబ్బాయి దత్త తీసుకుని అక్కడి సమస్యలను తీర్చడమనే పాయింట్ తనదేనని శరత్ చంద్ర ఆధారాలతో సహా సమర్పించడం ఈ కాంట్రావర్సీకి దారి చేసింది. కాపీ రైట్స్ వివాదాలు బయట పరిష్కరించుకోకపోతే అవి ఇలాగే తీవ్ర రూపం దాలుస్తున్నాయి. దేవర షూటింగ్, రిలీజ్ వాయిదా, అనిరుద్ తో పని చేయించుకోవడం లాంటి ఒత్తిడిలో ఉన్న కొరటాల శివ దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారో మరి.