అసాధ్యాన్ని సాధించాలని ప్రయత్నించే ప్రతి తెలుగువాడికీ ఎదురయ్యే ప్రశ్న…
“నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా?”
ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగువారికి “హీరో” అంటే చిరంజీవే!
వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ అసాధ్యం అనుకున్న దానిని సాధ్యం చేసి చూపించిన ఒక మధ్య తరగతి యువకుడు కొణిదెల శివశంకర వర ప్రసాద్ సాధించిన ఘనత అది. సినీ రంగాన చిరు అవకాశం దక్కించుకోవడమే పెద్ద అఛీవ్మెంట్ అని ఫీలయ్యే రోజుల్లో… చేతికొచ్చిన చిన్న చిన్న అవకాశాలను ఆలంబనగా చేసుకుని ఏకంగా “చిరంజీవి” అయిపోవడమంటే మాటలా మరి.
తెలుగు సినిమాకు, సినీ ప్రేక్షకులకూ కూడా హీరోకు కొత్త నిర్వచనం ఇచ్చి, భావి తరాలకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసారు చిరంజీవి. “ఫోర్త్ వాల్” బ్రేక్ చేసి సరాసరి ప్రేక్షకులతో కమ్యూనికేట్ చేసే సాహసం ఎంతమంది చేయగలరు మరి? చిరంజీవి వేసిన స్టెప్పులు రీక్రియేట్ చేయడం అప్పట్లో యువతకు ఒక ఛాలెంజ్ అయ్యేది. ఆయన నోట పలికిన పంచు డైలాగులు వాడుక భాషలోకి వచ్చేసేవి.
సమకాలికులు, తర్వాతి తరం వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్లకు చిరంజీవి రికార్డులే సక్సెస్ కు కొలబద్దలయ్యేవి. ఒకటా, రెండా… ఏకంగా మూడు దశాబ్దాలకు పైగా మకుటం లేని మహరాజులా తెలుగు చిత్ర సీమను ఏలిన ఛరిష్మా ఆయనది. పదేళ్లు కెమెరాకు దూరమైతే ఎవరికైనా మునుపటి స్థానంలో నిలబడడానికి పాదం తడబడుతుంది. అవలీలగా, అలవోకగా పదేళ్ల తర్వాత చులాగ్గా వచ్చి వంద కోట్ల షేర్ కొట్టి అవతలేసిన ఘనత ఆయనకు మాత్రమే దక్కింది. అంతవరకూ బాహుబలి తప్ప మరే సినిమా చేయలేకపోయిన ఫీట్ అది.
మెగాస్టార్ అని చాలా మంది హీరోలను సంబోధిస్తుంటారు కానీ… అది చిరంజీవి పేరు పక్కన ఒదిగిపోయినంత పొందికగా ఇంకే పేరు పక్కనా అనిపించదు. బహుశా అందుకేనేమో ఆయన పేరు సరసన డాక్టరేట్, పద్మభూషణ్… ఇప్పుడు పద్మవిభూషణ్ చేరినా “మెగాస్టార్ చిరంజీవి” అన్నప్పుడు వినిపించే “మెలోడీ” మన చెవులకు వినిపించదు. నటుడిగా ఆయన పోషించలేని పాత్ర లేదు. మనిషిగా ఆయన సాధించని ఘనత లేదు.
అభిమానులను సంఘటితం చేస్తే సమాజానికి ఎంతో సేవ చేయవచ్చునని గుర్తించి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎంతో మంది కళ్ళలో వెలుగయ్యారు, ఎంతో మంది జీవితాలలో రియల్ హీరో అయ్యారు. ఏడు పదుల వయసుకు దగ్గర పడుతున్నా ఇప్పటికీ ప్రేక్షకులను రంజింప చేయాలని, ఇప్పుడొస్తున్న హీరోలతో పోటీ పడి వారికి మించిన రికార్డులు సాధించాలని నిత్య విద్యార్థిలా ఆయన పడే తపనలో పదొంతులు ఉన్నా శిఖరాలు అధిరోహించవచ్చు.
దేశంలోనే ద్వితీయ అత్యుత్తమ పురస్కారమైన పద్మ విభూషణ్ సాధించిన మన మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తూ ఆయన పేరు సరసన అత్యంత ఉత్తమమైన ఆ పురస్కారం కూడా చేరిపోవాలనీ, ఆయన ఇలాగే మరెన్నో చిత్రాలలో ఇంకెన్నో మరపురాని పాత్రలు చేస్తూ మనల్ని ఇలాగే అలరిస్తుండాలని ఆశిస్తూ… Gulte.com తరఫున మనఃపూర్వక అభినందనలు.
Gulte Telugu Telugu Political and Movie News Updates