అమ్మ పాట దాచి పెట్టడమే పొరపాటు

బాక్సాఫీస్ ఫలితం మాటెలా ఉన్నా కలెక్షన్లకు సంబంధించి పెద్ద చర్చకు దారి తీసిన గుంటూరు కారం నుంచి అమ్మ పాటను ఇవాళ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. తమన్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి గారి హృద్యమైన సాహిత్యానికి విశాల్ మిశ్ర గాత్రం తోడై ఎమోషనల్ ఫీలిచ్చింది. తమది మాస్ సినిమా కాదని ఫ్యామిలీ మూవీగా ప్రోజెక్ట్ చేయడంలో పొరపాటు చేశామని ఇటీవలే ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ చెప్పడం తెలిసిందే. అలాంటప్పుడు ఈ అమ్మ పాటను ముందుగానే రిలీజ్ చేసి ఉంటే ఈ పాయింట్ ప్రేక్షకులకు సరిగ్గా రిజిస్టర్ అయ్యేదని అభిమానుల అభిప్రాయం.

ఇందులో లాజిక్ ఉంది. వకీల్ సాబ్ టైంలో మగువా మగువా సాంగ్ ని ముందుగా వదలడం వల్ల జనాలకు ముందే కంటెంట్ మీద అవగాహన వచ్చింది. రీమేకని తెలియని కామన్ ఆడియన్స్ సినిమా మహిళల అంశం మీద ఉంటుందని ఒక అంచనాకు వచ్చారు. కానీ గుంటూరు కారంకి సంబంధించి ఎంతసేపు దం మసాలా బిర్యాని, కుర్చీ మడత పెట్టిలను విపరీతంగా ప్రమోట్ చేశారు కానీ అమ్మ పాట ప్రస్తావనే తీసుకురాలేదు. పై పెచ్చు ఓ మై బేబీకి నెగటివిటీ వచ్చినప్పుడు దాని డ్యామేజ్ రిపేర్ కోసమైనా దీన్ని వాడాల్సింది. ఒకరకంగా చెప్పాలంటే మంచి ఛాన్స్ మిస్.

ఇప్పటికిప్పుడు దీని వల్ల కలిగే అనూహ్య ప్రయోజనం అంతగా లేదు. ఆల్రెడీ కలెక్షన్లలో చాలా డ్రాప్ ఉంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి కానీ వీక్ డేస్ లో పరిస్థితి ఆశాజనకంగా లేదని ఫ్యాన్స్ ఒప్పుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్ లో కేవలం ఇరవై ఎనిమిది రోజుల నిడివితో స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇలా కొత్త పబ్లిసిటీ కంటెంట్ ని వదలడం చూస్తే నిజమే కావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఆల్బమ్ లో తమన్ కంపోజ్ చేసిన పాటల్లో బెస్ట్ ట్రాక్ ఇదేనని మ్యూజిక్ లవర్స్ కామెంట్. ఒక రైలు జీవితకాలం లేటు సామెత గుర్తొస్తోంది.