మంచి టీజర్ వదిలారు.. పనైపోయింది

Color Photo

ఈ రోజుల్లో ఒక సినిమాకు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటివి ఎంత ముఖ్యమో ఎన్నోసార్లు రుజువైంది. ఒక మంచి టీజర్‌తో హైప్ తెచ్చుకుని, బిజినెస్ పూర్తి చేసుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి తెలుగులో. మూడేళ్ల కిందట ఘనవిజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’.. అందరి దృష్టినీ ఆకర్షించింది ఒక సెన్సేషనల్ టీజర్‌తోనే ఆ స్థాయిలో కాకపోయినా ఈ మధ్య ఓ చిన్న సినిమా టీజర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఆ సినిమానే.. కలర్ ఫోటో. కమెడియన్‌గా సత్తా చాటిన సుహాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. తెలుగు టాలెంటెడ్ హీరోయిన్ చాందిని చౌదరి కథానాయికగా.. కొత్త దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన చిత్రమిది. ‘హృదయకాలేయం’ దర్శక నిర్మాత సాయిరాజేష్ నీలం ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు.

గత నెలలో రిలీజైన ‘కలర్ ఫోటో’ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. నల్లగా ఉన్న ఓ అబ్బాయిని ఓ అందమైన అమ్మాయి ప్రేమించడం.. వీరి మధ్యలోకి ఓ బలమైన విలన్ రావడం.. బలహీనుడైన హీరో అతణ్ని ఢీకొట్టి అమ్మాయిని దక్కించుకోవడం.. ఈ లైన్లో సాగే ఈ కథను వినోదాత్మకంగా, హృద్యంగా తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమైంది. విజువల్స్, డైలాగ్స్, మ్యూజిక్ అన్నీ ఆకట్టుకున్నాయి. టీజర్లో మంచి ఫీల్ కనిపించింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మంచి రేటుకు అల్లు వారి ఓటీటీ ‘ఆహా’ దక్కించుకున్నట్లు సమాచారం. దీపావళి కానుకగా నవంబరు 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారట. పెట్టుబడి మీద లాభానికే దీని స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడయ్యాయట. ఇంకా శాటిలైట్‌తో పాటు డబ్బింగ్ రైట్స్ నిర్మాతల చేతిలోనే ఉన్నాయి. సినిమా బాగుంటే రీమేక్ రైట్స్ కోసం కూడా డిమాండ్ ఉండొచ్చు. మొత్తానికి ఒక మంచి టీజర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగితే సినిమాను ఎంత బాగా బిజినెస్ చేసుకోవచ్చడానికి ‘కలర్ ఫోటో’ తాజా రుజువుగా నిలిచింది.