ఇండియన్ కంటెంట్ అందులోనూ సౌత్ సినిమాల మీద వందల కోట్ల పెట్టుబడితో పరుగులు పెడుతున్న నెట్ ఫ్లిక్స్ కు ఈ నెల ఒకే వారంలో రెండు బంగారు బాతులు కనక వర్షం కురిపిస్తున్నాయి. మొన్న వచ్చిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కేవలం రెండు రోజులకే టాప్ 1 ట్రెండింగ్ లోకి వచ్చేసింది. నాలుగు వెర్షన్లలో మూడు టాప్ సెవెన్ లో చోటు దక్కించుకున్నాయి. అది కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో కావడం గమనించాల్సిన విషయం. థియేట్రికల్ రిలీజ్ కు కేవలం ఇరవై ఎనిమిది రోజుల గ్యాప్ లో స్ట్రీమింగ్ చేయడంతో ఆడియన్స్ ఎగబడి చూస్తున్న వైనం కనిపిస్తోంది.
విపరీతమైన అంచనాల మధ్య వెండితెరపై పూర్తి సంతృప్తి చెందని వాళ్ళు సైతం డిజిటల్ లో చూసి ప్రశాంత్ నీల్ పనితనానికి అబ్బుర పడుతున్నారు. దాని సాక్ష్యంగా బోలెడు ట్వీట్లు కనిపిస్తున్నాయి. సరిగ్గా వారం తిరక్కుండానే జనవరి 26న యానిమల్ ఇదే నెట్ ఫ్లిక్స్ లో వస్తోంది. దీని కోసం ఎదురు చూపులు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పనక్కర్లేదు. ప్రత్యేకంగా తొమ్మిది నిమిషాల అదనపు ఫుటేజ్ తో ఎడిట్ చేయని వర్షన్ వస్తుందని తెలియడంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే సలార్ రికార్డులు నమోదు చేస్తోందో వాటిని యానిమల్ ఈజీగా దాటడం ఖాయం.
చూస్తుంటే అమెజాన్ ప్రైమ్ కి చెక్ పెట్టేందుకు నెట్ ఫ్లిక్స్ అనుసరిస్తున్న వ్యూహం అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఇక్కడితో అయిపోలేదు. 2024లో చాలా క్రేజీ సినిమాలను సొంతం చేసుకుని దూసుకుపోతోంది. గుంటూరు కారం ఫిబ్రవరి రెండో వారంలోనే వస్తుందనే టాక్ ఆల్రెడీ తిరుగుతోంది. ఆపై పుష్ప 2, దేవర, విజయ్ దేవరకొండ 12 లాంటి భారీ చిత్రాలన్నీ నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా ప్రకటించింది. అతి త్వరలో ఎవరూ ఊహించని కాంబినేషన్లతో వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తోందట. ఆ మధ్య సిఈఓ హైదరాబాద్ వచ్చినపుడు దీనికి సంబంధించిన చర్చలే జరిగాయని ఇన్ సైడ్ టాక్.