రోజు రోజుకు హనుమాన్ రికార్డుల పర్వానికి ఆకాశమే హద్దుగా మారుతోంది. ఫలానా సెంటర్ అని కాకుండా పల్లెటూరి నుంచి ఓవర్సీస్ దాకా గత పది రోజుల నుంచి వసూళ్ల ఊచకోత కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా మరో అరుదైన ఘనత దక్కించుకున్నాడు. కేవలం 9 రోజుల్లో ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో కోటి రూపాయల గ్రాస్ దాటిన చిన్న చిత్రం(రిలీజ్ కు ముందు వేసిన స్టాంప్)గా కొత్త మైలురాయి అందుకుంది. జనవరి 12న హనుమాన్ కి ఇక్కడ ఇచ్చింది కేవలం ఒక్క సింగల్ స్క్రీనే. కానీ అనూహ్య జనాదరణతో తర్వాత ఎగ్జిబిటర్లే ముందుకు రావడంతో కౌంట్ అంతకంతా పెరిగింది. ఇందులో ప్రత్యేకత ఏంటో చూద్దాం.
ఆర్టీసి క్రాస్ రోడ్స్ లో ఇప్పటిదాకా కోటి రూపాయల గ్రాస్ దాటినవి సుమారు 55 దాకా ఉన్నాయి. వీటిలో అధిక శాతం పెద్ద స్టార్ హీరోలవే. అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో రూపొంది ఈ ఫీట్ సాధించిన వాటిలో చెప్పుకునేవి నువ్వే కావాలి, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, మనసంతా నువ్వే, నువ్వు నేను, జయం, గీత గోవిందం మొదలైనవి. అయితే వీటికి ఆ మార్కు చేరుకోవడానికి పట్టిన సమయం ఎక్కువ. రెండు వారాల లోపే హనుమాన్ కోటి సాధించడం చిన్న ఫీట్ కాదు. సంధ్య 70 ఎంఎం నుంచి 53 లక్షలకు పైగా గ్రాస్ రాగా జనాలు తక్కువ ప్రాధాన్యం ఇచ్చే సప్తగిరి 70 ఎంఎంలో 38 లక్షలకు దగ్గరకు వెళ్ళింది.
మిగిలిన మొత్తం సంధ్య 35 ఎంఎం, శాంతి 70 ఎంఎం, తారకరామా నుంచి వసూలైందని ట్రేడ్ టాక్. ఇంకా ఫైనల్ రన్ చాలా దూరం ఉంది కాబట్టి రెండు కోట్లను అందుకున్నా ఆశ్చర్యం లేదు. ఒకవేళ అదే జరిగితే తేజ సజ్జ కెరీర్ లో బెస్ట్ ఫిగర్స్ పడతాయి. అండర్ డాగ్ గా సంక్రాంతి బరిలో దిగి చివరికి విజేతగా నిలవడం ఎవరూ ఊహించని పరిణామం. అమ్ముడుపోయిన ప్రతి టికెట్ మీద 5 రూపాయలు అయోధ్య రామాలయానికి విరాళంగా ఇస్తామని చెప్పిన మాట ప్రకారం హనుమాన్ బృందం అధికారికంగా 2 కోట్ల 66 లక్షల 41 వేల 55 రూపాయలను ట్రస్ట్ కి అందజేసింది. ఇంకా ఇవ్వబోయేది భారీగా ఉండనుంది.