సినిమాల కలెక్షన్ల లెక్కలు జడ పదార్థం లాంటివి. వాటిలో విశ్వసనీయతను అంత సులభంగా నిర్ణయించలేం. ప్రస్తుతం ఇండస్ట్రీలో దీని మీద పెద్ద డిబేటే జరుగుతోంది. ఆన్ లైన్ ట్రాకర్స్ ఇస్తున్న ఫిగర్లు ప్రేక్షకుల మీద ప్రభావం చూపిస్తున్నాయని భావిస్తున్న నిర్మాతలు వాటికి అడ్డుకట్ట వేసేందుకు నోటీసులు ఇచ్చే దాకా వెళ్లడం రెండు రోజుల నుంచి తీవ్ర చర్చకు దారి తీసింది. ఒరిజినల్ ఏవో ఫేక్ ఎవరో తెలుసుకోలేని పరిస్థితిలో వీటికి నియంత్రించడం సాధ్యమా అంటే హైపోథెటికల్ (ఒకవైపే సమాధానం చెప్పలేని ఒక తరహా నిస్సహాయ స్థితి) ప్రశ్నగా చూడటం తప్ప వెంటనే సమాధానం చెప్పలేం.
సినిమా హిట్ అయితే ఎలాంటి సమస్య లేదు. ఎవరూ అంకెల గురించి అడగరు. పెద్ద స్టార్ హీరో చిత్రం యావరేజ్ అయినప్పుడు లేదా మిక్స్డ్ టాక్ తో సతమతమవుతున్నప్పుడు దాన్ని పుష్ చేసే క్రమంలో నిర్మాత చేసుకునే ప్రమోషన్లకు ఈ ట్రాకర్స్ పెట్టే నెంబర్లు ఇబ్బందిగా పరిణమిస్తాయి. ట్విట్టర్ లో వీటిని ఫాలో అయ్యేవాళ్ళు ఏంటి ఇంత తక్కువ కలెక్షన్ ఉందని భావించి, బాలేదేమోనని థియేటర్లకు దూరంగా ఉండే రిస్క్ లేకపోలేదు. అలా అని ప్రొడ్యూసర్ పోస్టర్లలో వేసేవి ఖచ్చితంగా నిజమా కాదాని చెప్పలేం. ఎందుకంటే ఆయనా తన సోర్స్ ఏంటో వెల్లడించడు కాబట్టి.
ఇది దశాబ్దాలుగా జరుగుతున్న ట్రెండే. కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. స్టార్ హీరోల అభిమానులు గొప్పలు చెప్పుకునే క్రమంలో ఫాల్స్ ప్రెస్టీజ్ కు వెళ్లి ఫేక్ నెంబర్లు, బలవంతంగా యాభై వంద రోజులు ఆడించటాలు గతంలో లెక్కలేనన్ని సార్లు జరిగాయి. జరుగుతున్నాయి. ఇక్కడ తప్పొప్పులను నిర్ణయించలేం. కొన్నిసార్లు మార్కెటింగ్ లో భాగంగా అబద్దాలు చెప్పాల్సి రావొచ్చు. ఫెయిర్ నెస్ క్రీం అమ్మే కంపెనీ నల్లని అమ్మాయి తెల్లగా మారొచ్చని యాడ్ లో చూపిస్తుంది. కానీ అది అసాధ్యమని తెలిసినా కొనేవాళ్లు కోట్లలో ఉంటారు. ఇది బిజినెస్. ఇలా చేస్తేనే పోటీలో నిలదొక్కుకుంటాం.
ఒకవేళ ఇప్పటికిప్పుడు ట్రాకర్స్ కి అడ్డుకట్ట వేసినా ఫేక్ అకౌంట్లతో ట్విట్టర్లు, ఇన్స్ టాలు నడిపే వాళ్ళను నియంత్రించడం చాలా కష్టం. పైగా దీన్నంతా సంఘటితంగా అమలు పరిచే వ్యవస్థ టాలీవుడ్ లో లేదు. పెద్ద సినిమాల హడావిడి అయ్యాక అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అవుతారు. కథ మళ్ళీ మొదటికే వస్తుంది. పైరసీ అణిచివేత, ఓటిటి నిడివి విషయంలో కఠిన నిబంధనలు ఇవేవి సరైన కార్యాచరణ లేకే పరిష్కారానికి నోచుకోకుండా సమస్యను పెంచుతున్నాయి. అలాంటపుడూ కలెక్షన్ల ప్రచారాలకు చెక్ పెట్టడమనేది వినడానికి సులువుగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పెద్ద సవాల్ విసరబోతోంది.