శనివారం బిజినెస్ వ్యూహం అదిరింది

న్యాచురల్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న సరిపోదా శనివారం థియేట్రికల్ డీల్ ని దిల్ రాజుకు చెందిన ఎస్విసి సొంతం చేసుకోవడం ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తింది. మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ కావడంతో సరిపడా థియేటర్లు దొరుకుతాయో లేదోననే టెన్షన్ లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి సుమారు పాతిక కోట్లకు డీల్ జరిగిందని ఇన్ సైడ్ టాక్. ఈ సినిమా రేంజ్ కి ఇది రీజనబుల్ మొత్తం. ఎందుకంటే నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తీస్తున్నారు. యాక్షన్ కం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉండటం వల్ల ఖర్చు కూడా అంతే ఉంది.

ఇక్కడ డివివి తెలివైన బిజినెస్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఓవర్సీస్, ఇతర బాషల డబ్బింగ్ హక్కులు, ఓటిటి రైట్స్, శాటిలైట్ వీటి నుంచి ఎంతలేదన్నా వంద కోట్లకు దగ్గరగా వస్తుంది. అంటే బడ్జెట్ ఓ అరవై డెబ్భై కోట్ల దాకా వేసుకున్నా హీనపక్షం ఇరవై కోట్లకు పైగానే లాభం కళ్లజూడవచ్చు. ఎలాగూ ప్రాజెక్టు మీద క్రేజ్ ఉంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయినా కాకపోయినా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఓజి సైతం ఇదే బ్యానర్ కావడంతో బయ్యర్లు రేట్లు ఎక్కువ తక్కువైనా అంతగా ఆలోచించరు. దసరా, హాయ్ నాన్నా వరస సూపర్ హిట్లతో ఒక్కసారిగా నాని మార్కెట్ పెరిగిపోయింది.

నిన్నటి నుంచి ఎస్జె సూర్య సెట్లో అడుగు పెట్టాడు. విలన్ గా చాలా వైవిధ్యమైన పాత్రను డిజైన్ చేశారట. తనకు నానికి మధ్య ఉండే కాంఫ్లిక్ట్ పాయింట్ ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయలేదని అంటున్నారు. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. దసరా లేదా దీపావళి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు కానీ ఎవరు పోటీలో ఉంటారనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోబోతున్నారు. అందుకే డేట్ ప్రకటించలేదు. గత కొన్నేళ్లలో షూటింగ్ పరంగా అత్యధిక సమయం కేటాయిస్తున్నది సరిపోదా శనివారంకే. అంటే సుందరానికి తర్వాత వివేక్ ఆత్రేయ చేస్తున్న మూవీ ఇదే.