లియో తప్పు సలార్ చేయలేదు

కేవలం 28 రోజుల గ్యాప్ తో సలార్ ఓటిటిలో వచ్చేయడం మూవీ లవర్స్ ని సంతోషపెట్టినా ప్రభాస్ అభిమానులను షాక్ కి గురి చేసింది. ఇంత తక్కువ నిడివిలో తమ హీరో పెద్ద ప్యాన్ ఇండియా మూవీని డిజిటల్ కి ఇచ్చేస్తే ఎలా అనే ఫిర్యాదు వాళ్ళ కామెంట్స్ లో కనిపిస్తోంది. అయితే తెలుగు, కన్నడ, తమిళ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతున్న సలార్ హిందీలో మాత్రం ఫిబ్రవరి రెండో వారం తర్వాతే రిలీజ్ అవుతుంది. దీనికి ఎప్పుడో ఆడేసి వెళ్ళిపోయిన జైలర్, లియోలకు సంబంధం ఏంటనే పాయింట్ కు వద్దాం. వాటిలో ఒకటి ఇదే నెట్ ఫ్లిక్స్ కొన్న సంగతి తెలిసిందే.

మాములుగా స్ట్రెయిట్ అయినా డబ్బింగ్ అయినా బాలీవుడ్ సినిమాని నార్త్ మల్టీప్లెక్సుల్లో రిలీజ్ చేయాలంటే ఎనిమిది వారాల థియేట్రికల్ విండో నిబంధన తప్పనిసరి. ఆ మేరకు హిందీ పెద్దలతో సదరు కార్పొరేట్ సంస్థలు అనధికార ఒప్పందాలు చేసుకున్నాయి. విడుదల సమయంలోనే దీనికి సంబంధించిన స్పష్టత ఇస్తేనే తమ స్క్రీన్లను ఇస్తాయి. లియో, జైలర్ నిర్మాతలు దీనికి ఒప్పుకోలేదు. నాలుగు వారాలకే ఓటిటి అగ్రిమెంట్లు చేసుకుంటామని తేల్చి చెప్పాయి. దీంతో హిందీ వెర్షన్ కేవలం సింగల్ స్క్రీన్లలో రిలీజ్ కావడంతో ఉత్తరాదిలో ఆశించిన రెవిన్యూ రాక నష్టం వచ్చింది.

కానీ హోంబాలే నిర్మాతలు చాలా తెలివిగా వ్యవహరించారు. కేవలం హిందీ ఓటిటిని మీరు చెప్పినట్టు ఆపి లేట్ గా స్ట్రీమింగ్ చేయిస్తామని, మిగిలిన బాషలకు ఇది వర్తించదని ఒప్పందం చేసుకున్నారు. దీంతో సలార్ కు ఎలాంటి సమస్య రాలేదు. డంకీ పోటీ వల్ల థియేటర్లు తగ్గినా వసూళ్ల విషయంలో ఇబ్బంది పడలేదు. ఒకవేళ లియో లాగా తొందపడి ఉంటే దెబ్బ పడేది. ఇదేదో బాగుందని మిగిలిన ప్యాన్ ఇండియా నిర్మాతలు కూడా ఇదే దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు. మొన్న నెట్ ఫ్లిక్స్ పండగ పేరుతో ప్రకటించిన సినిమాలన్నీ దాదాపు నాలుగు వారాల గ్యాప్ తో డీల్ ఫిక్స్ చేసుకున్నావేనట.