పవన్ కళ్యాణ్ డైరీలో ఖాళీ ఎక్కడుంది

ప్రస్తుతం ఏపీ ఎన్నికల కోసం జనసేన కార్యకలాపాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల గురించి వీసమెత్తు ఆలోచించే పరిస్థితిలో ఎంత మాత్రం లేడు. ఈ విషయాన్నే తన నిర్మాతలకు చాలా స్పష్టంగా చెప్పడంతో కొన్ని వారాల నుంచే ఆయా ప్రొడ్యూసర్లు ఎలాంటి హంగామా చేయకుండా మౌనంగా ఉన్నారు. చేతిలో మూడు చిత్రాలు పూర్తి చేయాల్సిన బాధ్యత పెట్టుకుని కొత్తగా కథలు వినే స్టేజిలో పవన్ లేడన్నది వాస్తవం. ఎలక్షన్ల ఫలితాలు ఎలా వస్తాయో తెలియదు. ఒకవేళ టిడిపి జనసేన కూటమి గెలిస్తే జరిగే పరిణామాలు షూటింగులకు మరింత దూరం చేస్తాయి తప్ప దగ్గర కాదు.

ముందు ఓజి పూర్తి చేయాలి. దర్శకుడు సుజిత్ ఇంకొక్క ముప్పై రోజుల కాల్ షీట్స్ ఇస్తే గుమ్మడికాయ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ని ఏ నిమిషంలో అయినా పరుగులు పెట్టించేందుకు హరీష్ శంకర్ ముందు నుంచి సన్నద్ధమే. ఇక హరిహర వీరమల్లు ఎక్కువ టైం డిమాండ్ చేస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా డేట్లు భారీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈలోగా సురేందర్ రెడ్డి తన స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తాడు. ఇంత టైట్ గా లైనప్ ఉంటే ఆట్లీకో త్రివిక్రమ్ కో సినిమా ఒప్పుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. అందుకే ఫ్యాన్స్ కొత్తగా ఏ వార్త పుట్టుకొచ్చినా సులభం నమ్మేలా లేరు.

సో ఎంతలేదన్నా పవన్ సినిమా వార్తలు వినాలంటే మాత్రం ఇంకో మూడు నాలుగు నెలలు ఎదురు చూడక తప్పదు. గత ఏడాది అన్నీ అనుకున్న ప్లానింగ్ ప్రకారం జరిగి ఉంటే ఉగాది లోపు ఒక రిలీజ్ కు ఛాన్స్ ఉండేది. కానీ ఎప్పటికప్పుడు మారిపోతున్న రాజకీయ వాతావరణంలో ఒక పద్ధతి ప్రకారం రెండు పడవల ప్రయాణం చేయడం పవన్ కు ఛాలెంజ్ గా మారిపోయింది. అలాంటప్పుడు కొత్త కమిట్ మెంట్లు ఇవ్వడం జరగని పని. మోహన్ లాల్ నేరు రీమేక్ ప్రతిపాదన అందుకే వద్దనుకున్నారట. ఒప్పుకుంటే వకీల్ సాబ్ 2 గా తీయాలని పలువురు ప్రయత్నించిన మాట నిజం.