ఈ మధ్య వెబ్ సిరీస్ లు కూడా భారీ బడ్జెట్లు, స్టార్ క్యాస్టింగ్, పేరున్న డైరెక్టర్లతో తెరకెక్కుతున్నాయి. సహజంగానే వాటి మీద అంచనాలు అధికంగా ఉంటాయి. అలాంటిదే ఇండియన్ పోలీస్ ఫోర్స్. బాలీవుడ్ మసాలా దర్శకుడిగా పేరున్న రోహిత్ శెట్టి మొదటిసారి డిజిటల్ లో అడుగు పెట్టి చేసిన ఖాకీ స్టోరీ ఇది. తనతో పాటు సుష్వంత్ ప్రకాష్ బాధ్యతలు పంచుకున్నారు. తెలుగుతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేసి నిన్న రాత్రి నుంచే స్ట్రీమింగ్ మొదలుపెట్టారు. ట్రయిలర్ గ్రాండ్ గా కనిపించడంతో జనాల్లో ఆసక్తి బాగానే ఉంది. ఇంతకీ పోలీస్ ఫోర్స్ అంత మెప్పించేలా ఉందో లేదో చూద్దాం
ఢిల్లీలో పలుచోట్ల వరస బాంబు పేలుళ్లలో రెండు వందల మందికి పైగా చనిపోతారు. డిసిపి కబీర్(సిద్దార్థ్ మల్హోత్రా), సిపి విక్రమ్(వివేక్ ఒబెరాయ్)లు కలిసి కేసు విచారణ మొదలుపెడతారు. ఏటిఎస్ స్పెషల్ ఆఫీసర్ తారా(శిల్ప శెట్టి)వీళ్లకు తోడవుతుంది. ఈ దాడులకు కారణమైన జరార్(మయాంక్ టాండన్) ఆచూకీ దొరక్కుండా జైపూర్, గోవా వెళ్లి అక్కడా ఇలాంటి దారుణాలకు పాల్పడతాడు. ఈ క్రమంలో విక్రమ్ చనిపోతాడు. చివరికి ఢాకలో తలదాచుకున్న జరార్ ని పట్టుకోవడానికి టీమ్ అనధికారికంగా అక్కడికి వెళ్తుంది. ఈజీగా ఊహించే క్లైమాక్స్ తో ఏడు ఎపిసోడ్ల సిరీస్ ముగుస్తుంది.
గతంలో ఎన్నోసార్లు చూసి అరిగిపోయిన కథనే రోహిత్ శెట్టి రాసుకున్నాడు. ఇదే బ్యాక్ డ్రాప్ లో ఇంతకన్నా గ్రిప్పింగ్ డ్రామాలు గతంలో బోలెడు చూసి ఉండటంతో ఎలాంటి కొత్తదనం అనిపించదు. విసుగు వచ్చేలా ఇబ్బంది పెట్టలేదు కానీ అబ్బురపరిచే ట్విస్టులు, గూస్ బంప్స్ ఇచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ లేకుండా స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా వెళ్తుంది. ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమం కూడా ఊహించేలా సాగుతుంది. సీనియర్ క్యాస్టింగ్, ప్రొడక్షన్ వేల్యూస్ మంచి గ్రాండియర్ లుక్ ఇచ్చాయి. వీటి కోసమే అయితే కాస్త ఓపికతో చూడొచ్చు కానీ మరీ ఎగ్జైటింగ్ అనిపించే స్థాయిలో ఇండియన్ పోలీస్ ఫోర్స్ మెప్పించలేకపోయింది.