ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది గుంటూరు కారం. మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ముందు నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ టైంకి హైప్ ఇంకా ఇంకా పెరిగింది. అసలే సంక్రాంతి సీజన్.. పైగా భారీ రిలీజ్.. కాబట్టి ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఒక రేంజ్ లో వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే గుంటూరు కారం బిజినెస్ లెక్కలు కొంచెం హెచ్చు స్థాయిలోనే ఉన్నాయి. మహేష్, త్రివిక్రమ్ కలిసి అందుకోవాల్సిన టార్గెట్లు పెద్దవే. వరల్డ్ వైడ్ ఈ సినిమా 135 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేయడం విశేషం.
ఒక్క నైజాం ఏరియాలోనే గుంటూరు కారం థియేట్రికల్ హక్కులు రూ.42 కోట్లు పలికాయి. ఈ ప్రాంతంలో అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఉత్తరాంధ్రలో గుంటూరు కారం హక్కులు 15 కోట్ల వరకు పలికాయి. సీడెడ్ రేటు 14 కోట్లు. ఆంధ్ర ప్రాంతంలోని మీద ఏరియాలన్నీ కలిపి 48 కోట్ల మేర బిజినెస్ చేసింది గుంటూరు కారం. ఇండియాలోని మిగతా రాష్ట్రాలన్నీ కలిపి 9:30 కోట్లు బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ రైట్స్ 21 కోట్లు పలికాయి. మొత్తంగా లెక్క 135 కోట్లు తేలింది. గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వరల్డ్ వైడ్ 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది.