కాదేది క్రియేటివిటీకి అనర్హం అన్నారు సినీ పెద్దలు. ఈ మధ్య ప్రమోషన్లు రొటీన్ గా మారిపోతున్నాయని భావిస్తున్న తరుణంలో మేకర్స్ కొత్త ఆలోచనలతో పబ్లిసిటీకి శ్రీకారం చుడుతున్నారు. అలాంటి ఐడియాతోనే వచ్చింది నా సామిరంగ టీమ్. ఊరికే తమ గురించే పదే పదే చెప్పుకోవడం ఏం బాగుంటుందని సంక్రాంతికి వచ్చే కొత్త రిలీజులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఒక పాట కంపోజ్ చేయించి విడుదల చేయడం మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. దీనిని స్వయంగా కీరవాణే లిరిక్స్ రాసుకుని ప్రతి అక్షరం స్పష్టంగా వినిపించేలా గాయకుడు లోకేశ్వర్ తో పాడించారు.
సింపుల్ ట్యూన్ తో ఆకట్టుకునేలా పదాలతో సాగిపోయింది. ‘ఆల్ ది బెస్టు సినీ గోయరూ బాక్సాఫీసుకి పెంచేయ్ రా ఫీవరూ’ అంటూ మొదలుపెట్టి ఒక్కో టీమ్ కి శుభాకాంక్షలు చెప్పారు. హనూ మ్యానూ ముందెళ్ళి నువ్వు సెట్టు చెయ్యి టోను, గుంటూరు కారం నువ్వు అదరగొట్టు ఈ శుక్రవారం, సైంధవా నువ్వు హిట్టు కొట్టి వేసుకోవ కండువా అంటూ క్యాచీ పదాలతో ఆకట్టుకుని చివరిలో ‘రంగరంగ వైభవంగా ఈ పండక్కి నా సామిరంగ’ అంటూ ముక్తాయింపు ఇవ్వడం బాగుంది. చరణాల సాహిత్యంలో కీరవాణి చలాకి మెరుపులు వినిపించారు. పాడుకోవడానికి సులభంగా ఉంది.
ఇదో మంచి ట్రెండ్ అని చెప్పాలి. ఎవరికి వారు పోటీ పడుతూ తమ సినిమాలకు ఎక్కువ థియేటర్లు కలెక్షన్లు రావాలని కోరుకుంటున్న పరిస్థితుల్లో ఇలా అందరికీ కలిపి పండగ లాంటి పాటను కానుకగా ఇవ్వడం బాగుంది. కీరవాణి గారు ఇంత ఇన్నోవేటివ్ గా ఇలాంటి ఆలోచన చేయడం బాగుంది. నా సామిరంగకు సంబంధించిన విజువల్స్ ఏమి చూపించకుండా కేవలం నాలుగు సినిమాల లోగోలు మాత్రమే హైలైట్ చేశారు. పండగ రేసులో చివరగా వస్తున్న ఈ విలేజ్ డ్రామా మీద నాగార్జున నమ్మకం అంతా ఇంతా కాదు. విపరీతమైన ఒత్తిడి తట్టుకుని మరి బరిలో దింపారు. బుకింగ్స్ కూడా మొదలైపోయాయి.