సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఎంత పెద్ద పంచాయతీ నడిచిందో తెలిసిందే. పోటీలో నిలిచిన ఐదు చిత్రాల నుంచి ఈగల్ సినిమాను సంక్రాంతి రేసు నుంచి తప్పించడంతో ఈ పంచాయితీ ఒక కొలిక్కి వచ్చింది.
పోటీ నుంచి తప్పుకున్న సినిమాకు సోలో డేట్ ఇప్పిస్తాం అన్న హామీ ప్రకారమే ఈగల్ చిత్రానికి ఫిబ్రవరి 9వ తేదీని ఓకే చేయించారు. ఆ రోజు రావాల్సిన టిల్లు స్క్వేర్ సినిమాను వాయిదా వేసుకోవడానికి నిర్మాత నాగ వంశీ అంగీకరించారు.
కానీ అదే డేట్ కు ఇంకో సినిమా ఉన్న సంగతి మరిచారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన చిత్రం కూడా ఫిబ్రవరి 9నే విడుదల కావాల్సి ఉంది. నెల కిందటే ఆ సినిమాకు రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈగల్ సినిమాకు డేట్ అనౌన్స్ చేశాక కూడా ఊరు పేరు భైరవకోన నిర్మాత, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర.. రిలీజ్ డేట్ల పంచాయితీకి సంబంధించి తమను ఎవరు సంప్రదించలేదని, కాబట్టి తమ చిత్రం చెప్పిన డేట్ కే వస్తుందని స్పష్టం చేశారు. ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చాక సినీ పెద్దలు ఎవరైనా రాజీ ప్రయత్నాలు చేస్తారేమో అనిపించింది. కానీ అలాంటిదేమీ జరిగినట్లు లేదు. ఊరు పేరు భైరవకోన చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ఒక పోస్టర్ ద్వారా మళ్ళీ కన్ఫర్మ్ చేసింది. ఈ టీం కాన్ఫిడెన్స్, దూకుడు చూస్తుంటే ఆ డేట్ నుంచి వెనక్కి తగ్గేలా లేరు.
మరోవైపు రజనీకాంత్ నటించిన తమిళ అనువాద చిత్రం లాల్ సలాం కూడా ఫిబ్రవరి 9కే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఇలా రెండు చిత్రాలు ఆ రోజునే వస్తుండడంతో ఈగల్ చిత్రానికి సోలో డేట్ అనే హామీని ఎలా నిలబెట్టుకుంటారన్నది ప్రశ్న.