వీరమల్లు…ఓ అంతులేని కథ

ప్రాజెక్టు ప్రకటించిన టైంలో పవన్ కళ్యాణ్ మొదటి ప్యాన్ ఇండియా మూవీగా హరిహర వీరమల్లు మీద వచ్చిన బజ్ అంతా ఇంతా కాదు. టీజర్ చూశాక అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఏవో కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చిందనుకున్నారు కానీ ఇంకా చాలా బ్యాలన్స్ ఉన్న విషయం వింటే షాక్ కొట్టక మానదు. స్వయంగా సంగీత దర్శకుడు కీరవాణే మూడు పాటలు మాత్రమే రికార్డ్ అయ్యాయని, క్రిష్ అందుబాటులోకి వస్తే మిగిలినవి పూర్తి చేస్తానని చెప్పడం చూస్తే బొమ్మ ఏ స్టేజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలెన్ని సాంగ్స్ అనుకున్నారో ఇంకా క్లారిటీ ఉన్నట్టు లేదు.

ఈ లెక్కన పాటలే ఇంత పెండింగ్ ఉంటే టాకీ పార్ట్ ఎంతో ఊహించుకోవచ్చు. మీడియా కలిసినప్పుడంతా నిర్మాత ఏఎం రత్నం అదిగో ఇదిగో అనడం తప్ప పక్కా సమాచారం ఇవ్వడం లేదు. ఆ మధ్య ఏపీ ఎన్నికలు కాగానే రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడా ఛాన్స్ తగ్గిపోయింది. అసలు 2024లో రావడం జరగని పనని తెలిసిపోయింది. ముందు ప్రాధాన్యత క్రమంలో ఓజి ఉంది. దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుంది. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు కనక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే పవన్ షూటింగ్స్ లో అడుగుపెట్టడం చాలా అంటే చాలా ఆలస్యమవుతుంది.

దీన్ని బట్టి 2025లో మాత్రమే హరిహర వీరమల్లుని ఆశించవచ్చు. అది కూడా పైన చెప్పిన మిగిలిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాకే. రత్నం కుమారుడు జ్యోతికృష్ణ బాలన్స్ పనులను తన చేతుల్లోకి తీసుకున్నారనే టాక్ వచ్చింది కానీ క్రిష్ ప్రమేయం లేకుండా తనైనా అన్ని పూర్తి చేయలేడు. బాబీ డియోల్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అతని భాగాన్ని ఇంకా పూర్తి చేయలేదట. హీరోయిన్ నిధి అగర్వాల్ ఎక్కడ ఉందో తెలియదు. ఇదంతా ఒక ఎత్తు అయితే వీరమల్లు పాత్ర కోసం పవన్ మళ్ళీ జులపాల జుట్టు పెంచాల్సి ఉంటుంది. ఇదంతా ఎప్పటికి అవుతుందో కాలమే సమాధానం చెప్పాలి.