గుంటూరు కారం ఈవెంట్ వాయిదా – నెక్స్ట్ ఏంటి

రేపు జరగాల్సిన గుంటూరు ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ముందుగా ప్లాన్ చేసుకున్న హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరగడం లేదని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వీలైనంత త్వరగా కొత్త వేదిక, తేదీ, సమయం తెలియజేస్తామని హారికా హాసిని తరఫున అఫీషియల్ ట్వీట్ వచ్చేసింది. సెక్యూరిటీ కారణాలతో పాటు ఇప్పుడు గుంటూరు కారం బాధ్యతను తీసుకున్న ఈవెంట్ ఆర్గజైజర్స్ తాలూకు ఇటీవలి ట్రాక్ రికార్డు మీద ఫిర్యాదులు ఉండటం వల్లే అనుమతి నిరాకరణ జరిగిందని ఇన్ సైడ్ టాక్. ఆఘమేఘాల మీద వేరే ఆప్షన్ల పరిశీలన జరుగుతోంది.

ఆదివారం జరిగే ఛాన్స్ లేనట్టే. తక్కువ టైంతో పాటు చిరంజీవి అతిథిగా వస్తున్న హనుమాన్ ఈవెంట్ అదే రోజు ఉండటం వల్ల సాధ్యపడదు. ఇక వీక్ డేస్ తప్ప వేరే ఆప్షన్ లేదు.. టైటిల్ సెంటిమెంట్ ని అనుసరించి ముందు గుంటూరులో చేయాలని అనుకున్నారు కానీ షూటింగ్ ఒత్తిడి వల్ల అంత టైం లేదని గుర్తించి ఫైనల్ గా భాగ్యనగరానికి ఫిక్స్ అయ్యారు. అయితే పర్మిషన్ల కోసం వారం పది రోజుల ముందే ట్రై చేయడానికి బదులు హడావిడిగా రెండు రోజుల ముందు అప్లై చేయడం కూడా ఈ ఇబ్బందికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. తెరవెనుక నడిచింది బయటికి చెప్పడం లేదు.

రేపు ఈవెంట్ కోసమని మహేష్ బాబు అభిమానులు చాలా దూరం నుంచి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. రిజర్వేషన్లు, ప్రయాణాలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడీ వార్త నిరాశపరిచేదే. వీకెండ్ కాబట్టి సరదాగా వేడుకను ఎంజాయ్ చేసి సండేని జాలీగా గడుపుదామని చూసిన ఫ్యాన్స్ కి పెద్ద షాకే తగిలింది. ఇంకో వారం రోజులే రిలీజ్ టైం ఉండటంతో జనాల ఎగ్జైట్ మెంట్ మాములుగా లేదు. అందరి కళ్ళు ట్రైలర్ మీదే ఉన్నాయి. అది కూడా ఈవెంట్ లోనే రిలీజ్ చేయాలి కాబట్టి దానికీ వాయిదా తప్పలేదు. బహుశా సోమవారం లేదా బుధవారంలో కొత్త వేదిక ఫిక్స్ అవ్వొచ్చు.