రాజస్థాన్ రాష్ట్రంలో ‘టైసన్’ మాస్

నాలుగేళ్ల క్రితం వచ్చిన అల్లుడు అదుర్స్ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మళ్ళీ తెలుగు తెరమీద కనిపించలేదు. ఛత్రపతి హిందీ రీమేక్ కోసం మూడు సంవత్సరాల విలువైన కాలాన్ని ఖర్చు పెట్టి. ముంబైకి మకాం మార్చినా లాభం లేకపోయింది. ఇక్కడున్న మంచి మార్కెట్ ని వదిలేసుకొని అక్కడికి వెళ్లడం ఎంత పొరపాటో త్వరగానే అర్థమయ్యింది. అందుకే తిరిగి టాలీవుడ్ వచ్చేశాడు. భీమ్లా నాయక్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న దర్శకుడు సాగర్ కె చంద్రతో చేతులు కలిపి టైసన్ నాయుడుగా రాబోతున్నాడు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా చిన్న టీజర్ ఒకటి వదిలారు.

కథని పెద్దగా రివీల్ చేయలేదు. రాజస్థాన్ లో ఉండే పోలీస్ ట్రైనింగ్ అకాడమీకి వెళ్తాడు టైసన్(బెల్లంకొండ సాయిశ్రీనివాస్). అక్కడ శిక్షణ ఇచ్చే ఆఫీసర్ ని మొదటి కలయికలోనే బాక్సింగ్ లో మట్టి కరిపించి షాక్ ఇస్తాడు. శిక్షణ పూర్తి చేసుకుని డిప్యూటీ సూపర్ ఇండెంటెంట్ అఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరిస్తాడు. అసలు అంత దూర రాష్ట్రానికి ఇతను ఎందుకు వెళ్ళాడు, టైసన్ పేరు పెట్టుకోవడం వెనుక మర్మం ఏమిటనే ప్రశ్నలకు సమాధానం ట్రైలర్ వచ్చాక తెలుస్తాయేమో. బ్యాక్ డ్రాప్, బడ్జెట్ చూస్తుంటే 14 రీల్స్ నిర్మాణంలో భారీగా ప్లాన్ చేశారని అనిపిస్తోంది.

ట్విస్టు ఏంటంటే హీరోయిన్ ఎవరనేది వీడియోలో కానీ, యూట్యూబ్ టీజర్ ఇన్ఫోలో కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంతకీ ఎంపిక చేసుకున్నారో లేదో కూడా చెప్పలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భీమ్స్ సిసిరోలియో అందించగా ముఖేష్ గణేష్ ఛాయాగ్రహణం సమకూర్చారు. మిగిలిన క్యాస్టింగ్ ని రివీల్ చేయలేదు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో టైసన్ నాయుడుకి తరచు బ్రేకులు పడుతున్నాయి కానీ 2024లోనే విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఎదురు చూస్తున్న సాయిశ్రీనివాస్ ఈసారి కూడా కమర్షియల్ జానర్ నే ఎంచుకుని రిస్క్ లేకుండా చూసుకుంటున్నాడు