కాంతార రేంజులో కాటేరాని మోస్తున్నారు

విడుదలకు ముందు సలార్ ని టార్గెట్ చేసుకుని కన్నడ స్టార్ హీరో దర్శన్ చేసిన కామెంట్లు ఆ టైంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కేవలం వారం గ్యాప్ లో 29న తన కొత్త సినిమా ‘కాటేరా’ విడుదల చేయడం పట్ల మీడియా అడిగిన ప్రశ్నలకు అసహనం వ్యక్తం చేస్తూ నేనెవరికీ భయపడనని, బయటి వాళ్లొస్తే నాకేంటని చెప్పడం వైరలయ్యింది. అంచనాలకు తగ్గట్టుగానే కాటేరా కర్ణాటకలో బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తోంది. రవితేజ ‘పవర్’ లాంటి హిట్ మూవీస్ తీసిన రాక్ లైన్ వెంకటేష్ దీనికి నిర్మాత. వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ ఖాయమని బెంగళూరు మీడియా నొక్కి చెబుతోంది.

ఏకంగా కాంతార స్థాయిలో దీన్ని మోసేస్తున్నారు. కథేంటంటే కొలిమి పని చేసే హీరోకి తన గ్రామంలో ఎదురయ్యే పరిస్థితులు, ఊరి దొరల అహంకారానికి ఎదురొడ్డి ఏకంగా యావజ్జీవ శిక్ష పడే స్థాయిలో హత్యలు చేయడం దాకా కమర్షియల్ అంశాలు మిస్ చేయకుండా దర్శకుడు తరుణ్ సుధీర్ తీర్చిదిద్దిన విధానం  ఆడియన్స్ ని మెప్పించింది. 90 దశకంలో మనకు బాగా సుపరిచితురాలైన సీనియర్ హిరోయిన్ మాలాశ్రీ కూతురు ఆరాధనా రామ్ దీని ద్వారా డెబ్యూ చేసింది. 1960 నేపథ్యంలో మొదలుపెట్టి 1987లో కాటేరా జైలు నుంచి బయటికి వచ్చే దాకా క్రమాన్ని పేర్చుకుంటూ పోయారు.

ఒకరకంగా చెప్పాలంటే ‘రంగస్థలం’ స్ఫూర్తి ఇందులో చాలా కనిపిస్తుంది. అచ్చం రంగమ్మ మంగమ్మ టైపులో ఒక పాట పెట్టారు. హీరోయిన్ చనిపోయే ఎపిసోడ్ ని నరేష్ అంత్యక్రియల తరహాలో డిజైన్ చేశారు. ఒక ఫైట్ రామ్ చరణ్ అజయ్ ఘోష్ ని చితకబాదే రేంజ్ లో పెట్టారు. ఇలా రెఫరెన్సులు చాలానే ఉన్నాయి. ఏదైతేనేం హౌస్ ఫుల్ బోర్డులతో కాటేరా పెర్ఫార్మన్స్ బాగానే ఉంది. దీని ప్రస్తావన మనకెందుకంటే త్వరలోనే తమిళ, తెలుగు భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ముందు కన్నడలో ఆడితే చాలనుకున్న నిర్మాత ఇప్పుడు పక్క లాంగ్వేజెస్ లోనూ అనువదించబోతున్నారు.