ఎప్పుడూ లేనిది రామ్ చరణ్ ఈ మధ్య ముంబైకి బాగా తిరిగేస్తున్నాడు. మొదట్లో ఏదో పర్సనల్ ట్రిప్ కోసమని అందరూ అనుకున్నారు కానీ ఏకంగా ఒక ఫ్లాట్ తీసుకుని మరీ వెళ్ళినప్పుడంతా అక్కడ మకాం వేయడం కొత్త వార్తలకు చోటిచ్చింది. అధిక సందర్భాల్లో సతీ సమేతంగా వెళ్లిన చరణ్ తన పర్యటనకు సంబంధించి ఎయిర్ పోర్ట్, గుళ్ళు గోపురాల ఫోటోలు వీడియోలు తప్ప ఇంకేదీ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ధూమ్ 4ని యష్ రాజ్ ఫిలిమ్స్ షారుఖ్ ఖాన్ తో ప్లాన్ చేస్తోందని, అందులో మరో హీరోగా చరణ్ నే అనుకుంటున్నారని ప్రచారం మొదలైపోయింది.
వాస్తవానికి ధూమ్ 4 ప్రతిపాదన నిజమే కానీ అది షారుఖ్ చరణ్ కాంబినేషన్ లో మాత్రం కాదని ముంబై వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ ఏడాది మూడు సినిమాలతో అభిమానులకు నాన్ స్టాప్ ట్రీట్ ఇచ్చిన బాద్షా 2024లో తెరమీద కనిపించకపోవచ్చు. బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. అసలు ధూమ్ 4 కథే తన దగ్గరకు వెళ్లలేదని వినికిడి. ఒకవేళ చరణ్ తో నిజంగా ఫిక్స్ చేయాలనుకున్నా ఆ మల్టీస్టారర్లో వేరే హీరోని భాగం చేస్తారని తెలిసింది. ఇది కాసేపు పక్కనపెడితే పలువురు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ తో రామ్ చరణ్ చర్చలు జరిపి వస్తున్న మాట వాస్తవం.
జంజీర్ టైంలో తనను ట్రోలింగ్ చేసే రేంజ్ లో వార్తలు రాసిన నార్త్ మీడియాతోనే మెచ్చుకోలు పొందాలంటే ఒక స్ట్రెయిట్ హిందీ మూవీ ద్వారా ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని చూస్తున్న చరణ్ దాన్ని ఆర్ఆర్ఆర్ తో కొంత భాగం నెరవేర్చుకున్నా అది డబ్బింగ్ మూవీ కావడం వల్ల టార్గెట్ పూర్తిగా చేరుకున్నట్టు కాదు. సంజయ్ లీలా భన్సాలీ, మధుర్ బండార్కర్, అశుతోష్ గోవరికర్ తదితరులు టాలీవుడ్ స్టార్లతో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు కానీ సాధ్యపడటం లేదు. రామ్ చరణ్ తో డిజిటల్ డెబ్యూ చేయించేందుకు నెట్ ఫ్లిక్స్ కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్టు ఓటిటి వర్గాల కథనం.