రేపు చెప్పుకోదగ్గ అంచనాలతో డెవిల్ విడుదల కాబోతోంది. బజ్ విషయంలో భారీ క్రేజ్ లేదు కానీ టీమ్ మాత్రం టాక్ మీద చాలా నమ్మకంతో ఉంది. బింబిసార బ్లాక్ బస్టర్, అమిగోస్ ఫ్లాప్ తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన సినిమా కావడంతో అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ముందు ప్రాజెక్ట్ టేకప్ చేసిన దర్శకుడు నవీన్ మేడారం స్థానంలో నిర్మాత అభిషేక్ నామానే ఆ బాధ్యతను తీసుకోవడం గురించి ఇండస్ట్రీలో, బయటి వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. అతను మోయలేకపోవడంతో పాటు విబేధాలు రావడం వల్లే మార్చాల్సి వచ్చిందని ప్రొడ్యూసర్ పలు ఇంటర్వ్యూలలో వివరణ ఇస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద డెవిల్ కు మంచి ఛాన్స్ ఉంది. సలార్ ఊపు కొంత తగ్గింది కాబట్టి దాన్ని థియేటర్లలో చూసేసిన ఆడియన్స్ కి కొత్త ఆప్షన్ గా డెవిల్, బబుల్ గమ్ రెండే ఉన్నాయి. వేరే రిలీజులు క్యూ కట్టాయి కానీ వాటి మీద ప్రేక్షకుల దృష్టి అంతగా లేదు. డెవిల్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే జనవరి 11 వరకు బ్రేకులు పడే ఛాన్స్ లేదు. సంక్రాంతి దెబ్బకు మధ్యలో ఏ నిర్మాత తమ సినిమాల విడుదలకు సాహసించడం లేదు. సో కళ్యాణ్ రామ్ కు ఒకరకంగా ఇది మంచి అవకాశమే. కాకపోతే ప్రమోషన్లకు చాలా తక్కువ దొరకడంతో జనానికి పూర్తిగా రిజిస్టర్ కాలేకపోయింది.
రేపు ఉదయం ఏడు గంటల ఉంచి ప్రీమియర్లు వేస్తున్నారు. ట్రైలర్ చూశాకే దిల్ రాజు పంపిణి బాధ్యతలకు ముందుకొచ్చారు. ఇది స్క్రీన్ కౌంట్ పరంగా కలిసి వచ్చే అంశం. బ్రిటిష్ పాలన బ్యాక్ డ్రాప్ లో ఒక మర్డర్ కేస్ విచారణ కోసం గూఢచారి చేసే సాహసాల ఆధారంగా డెవిల్ ని రూపొందించారు. యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఛాయాగ్రహణం సమకూర్చడం మరో ఆకర్షణగా నిలుస్తోంది. భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆశించిన నందమూరి అభిమానులకు నిరాశ తప్పలేదు. ఓ రెండు రోజులాగి సక్సెస్ మీట్ చేయాలనే ఆలోచనలో నిర్మాత ఉన్నారట. చూడాలి మరి కళ్యాణ్ రామ్ ఈసారి ఎలాంటి హిట్టు కొడతాడో