నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన కెరీర్ కు అతి దగ్గరలో ఉన్న విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమాగా సైంధవ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఊర మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయడంతో ఫ్యాన్స్ ఉత్సాహం మాములుగా లేదు. సంక్రాంతికి ఎంత పోటీ ఉన్నా సరే గెలవడం ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు. ఈ స్పెషల్ అకేషన్ ని జరుపుకోవడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. ఎల్లుండి 27న హైదరాబాద్ JRC కన్వెషన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా వేడుకలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినట్టు తెలిసింది. ఈ ఈవెంట్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉండబోతున్నాయని టాక్
గెస్టులుగా చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో పాటు కలియుగ పాండవులతో మొదలుపెట్టి సైంధవ్ దాకా పని చేసిన డైరెక్టర్లు, టెక్నీషియన్లు, హీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు వీలైనంత ఎక్కువ మందిని తీసుకొచ్చేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. రానా ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయట. వెంకీతో పని చేసిన ఎందరో దర్శకులు అందుబాటులోనే ఉన్నారు. కె రాఘవేంద్రరావు, బి గోపాల్, కోదండరామిరెడ్డి, ముప్పలనేని శివ, భీమినేని శ్రీనివాసరావు, సురేష్ కృష్ణ, జయంత్ సి పరాంజీ ఇలా ఎందరో హాజరయ్యేందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం.
కె విశ్వనాథ్, కోడి రామకృష్ణ లాంటి కొందరు కాలం చేయడం వల్ల వాళ్ళ లోటు మాత్రం ఉండిపోతుంది. ఫ్యాన్స్ కోసం పరిమితంగా పాసులు జారీ చేశారు. ఎవరెవరు వస్తున్నారనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. శ్రీవిష్ణు లాంటి వెంకీని విపరీతంగా ఆరాధించే కుర్ర హీరోలు కూడా ఇందులో భాగం కాబోతున్నారు. సైంధవ్ టీమ్ తో రానా ఈ మొత్తం ప్రోగ్రాంని పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. వంద చిత్రాలకు ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఈ మెమరీని చాలా స్పెషల్ గా మలచబోతున్నారట. అన్నట్టు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలకు ఇలా 75వ వేడుక జరుపుకునే ఛాన్స్ రాలేదు.