కన్నడ సలార్ అందుకే వెనుకబడింది

క్రిస్మస్ పండగని లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగిన సలార్ ఊహించిన దానికన్నా అరాచకంగా వసూళ్లు రాబడుతున్నాడు. యూనిట్ అధికారికంగా మూడు రోజుల గ్రాస్ ని 402 కోట్లుగా ప్రకటించడంలోని నిజాల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కానీ ఓవరాల్ గా చూస్తే శుక్రవారంతో మొదలుపెట్టి ఇవాళ సోమవారం దాకా ప్రభాస్ చేస్తున్న విధ్వంసం హౌస్ ఫుల్ బోర్డుల రూపంలో కనిపిస్తోంది. అయితే కర్ణాటకలో మాత్రం ఆశించిన స్థాయిలో దూకుడు చూపించడం లేదు. తమిళనాడు. కేరళ కన్నా మెరుగ్గానే ఉన్నప్పటికీ ఇప్పటిదాకా పద్నాలుగు కోట్లకు దగ్గరగా మాత్రమే షేర్ వచ్చింది.

దీనికి పలు కారణాలున్నాయి. మొదటిది సలార్ దర్శకుడు ప్రశాంత్ నీలే తీసిన కన్నడ మూవీ ఉగ్రంకి రీమేకనే నిర్ధారణ విడుదలకు ముందే వచ్చేయడం. ఉగ్రంని శాండల్ వుడ్ ఆడియన్స్ ఎప్పుడో చూసేసి బ్లాక్ బస్టర్ చేశారు. యూట్యూబ్ లో ఉచితంగా అందుబాటులో ఉంది. టీవీలో బోలెడుసార్లు చూసినవాళ్లకు సలార్ లో గ్రాండియర్ తప్ప కథ పరంగా కొత్తదనం అనిపించదు. పైగా సోషల్ మీడియాలో రెండు సినిమాల తాలూకు పిక్స్, వీడియోస్ పోలుస్తూ మరీ ట్వీట్లు చేయడం ఆసక్తిని తగ్గించింది. రెండోది ప్రభాస్ ని వాళ్ళు బాహుబలి మినహాయించి ఇంకా పూర్తిగా ఓన్ చేసుకోకపోవడం.

వీటికి తోడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ తో స్వంత గడ్డ మీద ఇండస్ట్రీ హిట్టు కొట్టి ఇప్పుడు పక్క బాషల హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో సినిమాలు చేయడం హార్డ్ కోర్ కన్నడ అభిమానులకు నచ్చడం లేదు. ఈ నిరసన కూడా కొంత ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడమే కాదు కెజిఎఫ్ తో పోలిక తేవడం కూడా అధిక శాతం ప్రేక్షకులను దూరం చేసింది. తెలుగులో ఈ ఇబ్బంది ఎందుకు రాలేదంటే మనకు అల్లరి నరేష్ ఉగ్రం తెలుసు కానీ శ్రీమురళి ఉగ్రం చూడలేదు కాబట్టి. అదండీ కన్నడనాడులో సలార్ వెనుకబాటు వెనుక అసలు కోణం.