హనుమంతుడి మీద ఒత్తిడి మంత్రం

సంక్రాంతి సినిమాల్లో ఒక రోజు ముందుకు రావడమో లేదా వాయిదా వేసుకోడమో చేయమనే ఒత్తిడి హనుమాన్ నిర్మాత మీద విపరీతంగా ఉందన్న వార్త ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగానే చక్కర్లు కొడుతోంది. ప్రైమ్ షో ఎప్పటి నుంచో పాతుకుపోయిన బ్యానర్ కాదు కాబట్టి ఆ మేరకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్ బలంగా ఉంది. అయితే నిర్మాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదనే సంకేతాలను పంపిస్తునే ఉన్నారు. జనవరి 12 గుంటూరు కారం వచ్చే రోజునే రిలీజ్ చేయడం వల్ల కౌంట్ తగ్గినా స్థాయికి తగ్గట్టు చెప్పుకోదగ్గ థియేటర్లు అయితే హనుమాన్ కు దక్కుతాయి.

అదే మహేష్ మూవీకి సోలో రిలీజ్ దక్కితే ఓపెనింగ్స్ ఫిగర్స్ ఇంకా భారీగా పడతాయి. మార్కెట్ పరంగా హీరోలిద్దరికీ పోలిక లేకపోయినా హనుమాన్ ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా చిన్న పిల్లలను తనవైపు చూసేలా చేసుకుంది. ఇది పండగ టైంలో ఓపెనింగ్స్ కి తోడ్పడే విషయమే. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జనవరి 22 ఉన్న నేపథ్యంలో పది రోజుల ముందుగా హనుమాన్ ని విడుదల చేయడం వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ ప్రయోజనం దక్కుతుందనేది ప్రొడ్యూసర్ నమ్మకం. దానికి తగ్గట్టే వెయ్యికి పైగా స్క్రీన్లను నార్త్ లో ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇంత ప్రణాళికతో ఉన్నప్పుడు హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడం కష్టమే. తేజ సజ్జ ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. ప్రశాంత్ వర్మ సైతం ప్యాన్ ఇండియా రీచ్ కోసం దేశమంతా తిరగాలని నిర్ణయించుకున్నాడు. ఒకే రోజు గ్యాప్ లో సైంధ‌వ్‌, ఈగల్ వస్తున్నప్పటికీ ఆ పోటీ గురించి హనుమాన్ ఆలోచించడం లేదు. పైగా నా సామిరంగ 14 వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. క్యాస్టింగ్ పరంగా చిన్న సినిమానే కానీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ కోణంలో చూసుకుంటే హనుమాన్ స్కేల్ ఎవరికీ తీసిపోయేది కాదు. సో ఫైనల్ గా చెప్పాలంటే హనుమంతుడు వెనుకడుగు వేయడం జరిగేలా లేదు