కాగల కార్యము డంకీ తీర్చెను

ఈ ఏడాది షారుక్ ఖాన్ నుంచి వచ్చిన పఠాన్, జవాన్ సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఈ ఊపులో రాజ్ కుమార్ హిరానీ లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో జట్టు కట్టాడు షారుఖ్. ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు పోటీగా వెళ్లాలంటే మరే చిత్రమైనా భయపడాలి. కానీ సలార్ మూవీకి అలా భయపడాల్సిన అవసరమే రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది ప్రభాస్ సినిమా. కాకపోతే హిరానీ సినిమా అంటే ఆషామాషీగా ఉండదు కాబట్టి రెండు చిత్రాల్లో డంకీకే బెటర్ టాక్ వస్తుందన్న అంచనాలు కలిగాయి. కానీ మాస్- యాక్షన్ మూవీ కాబట్టి సలారే వసూళ్లపరంగా పైచేయి సాధిస్తుందని అనుకున్నారు.

అయితే ఇప్పుడు డంకీ మూవీకి టాక్ సైతం సరిగా రాలేదు. రాజ్ కుమార్ హిరానీ కేరీర్లోనే వీకెస్ట్ సినిమాగా డంకి పేరు తెచ్చుకుంది. అసలే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా వెనుకబడింది. పైగా టాక్ కూడా బాలేకపోవడంతో డంకి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

డంకికి వచ్చిన టాక్ సలార్ కు ఫుల్ అడ్వాంటేజ్ అవుతుందనడంలో సందేహం లేదు. ప్రోమోలు అంత గొప్పగా లేకపోయినా సరే సలార్ ప్రి రిలీజ్ హైప్ ఏ స్థాయికి చేరిందో తెలిసింది. ఏకంగా 30 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైపోయాయి ఒకరోజు ముందే. ఎక్కడ షో ఓపెన్ చేసినా నిమిషాల్లో టికెట్లు అయిపోతున్నాయి. ఇలాంటి హైప్ ఉన్న సినిమాకు పోటీగా వీక్ మూవీ పడితే దాన్ని తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోవడమే జరుగుతుంది.

ఇప్పుడున్న అడ్వాంటేజ్ చాలదు అన్నట్లు సలార్ కి గనుక మంచి టాక్ వచ్చిందంటే అది సాగించే బాక్స్ ఆఫీస్ విధ్వంసానికి ఆకాశమే హద్దు. క్రిస్మస్, ఇయర్ అండ్, న్యూ ఇయర్ సెలవులను పూర్తిగా ఉపయోగించుకుంటూ.. రికార్డులు బద్దలు కొడుతూ.. సంచలన వసూళ్లతో దూసుకెళ్ళడం ఖాయం.