సలార్ టార్గెట్లు ఇవే

ప్రభాస్- ప్రశాంత్ నీల్ మెగా కాంబినేషన్లో రూపొందిన సలార్ ఇంకొక్క రోజు వ్యవధిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అంతకంతకు అంచనాలు పెరిగాయి తప్ప తగ్గలేదు. దీంతో సినిమాకు బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరిగింది. బాహుబలిని మించి వివిధ ఏరియాల్లో రేట్లు పలకడం విశేషం. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు రూ. 350 కోట్లకు పైగా బిజినెస్ జరగడం గమనార్హం.

ప్రతి ఏరియాలోనూ టార్గెట్లు పెద్దగానే ఉన్నాయి. ప్రి రిలీజ్ హైప్ భారీగానే ఉన్నప్పటికీ… సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలకడగా ఒక వారం పాటు భారీ వసూళ్లు సాధిస్తే తప్ప ఆ టార్గెట్లను అందుకోవడం తేలిక కాదు. ఇంతకీ ఏ ఏరియాలో సలార్ టార్గెట్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం.

ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. నైజాంలో రికార్డు స్థాయిలో రూ.65 కోట్ల బిజినెస్ చేసింది సలార్. అంటే తెలంగాణ వరకే గ్రాస్ వసూళ్లు 100 కోట్లు దాటాలన్నమాట. ఇక ఆంధ్ర ఏరియాలో కూడా నైజాంకు దీటుగా బిజినెస్ జరిగింది. అక్కడ హక్కులు రూ.62 కోట్లు పలికాయి. సీడెడ్ హక్కులు రూ.24 కోట్లు తెచ్చిపెట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో సలార్ 150 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇక్కడ మాత్రమే సినిమా 250 కోట్ల మేర గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

ఇక సౌత్ ఇండియా లో మిగతా రాష్ట్రాల్లో రూ.50 కోట్ల బిజినెస్ జరిగింది సలార్ కు. హిందీ వర్షన్ హక్కులు 75 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ మరో 75 కోట్లు పలికాయి. మొత్తంగా సలార్ థియేట్రికల్ బిజీనెస్ 350 కోట్ల మార్కును టచ్ చేసింది. ఈ టార్గెట్ ను అందుకోవాలంటే సలార్ ఫుల్ రన్లో రూ 600 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. సినిమాకు ఉన్న హైప్ దృష్ట్యా టాక్ బాగుంటే ఈ టార్గెట్ మరీ కష్టమేమీ కాదు.