సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య పోటీకి సై అంటుంది హనుమాన్. పైగా గుంటూరు కారం లాంటి భారీ చిత్రానికి పోటీగా జనవరి 12నే ఈ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇది మరీ రిస్క్ అంటున్న వాళ్లు లేకపోలేదు. అయితే తమ సినిమా మీద ధీమాతోనే సంక్రాంతి పోటీకి సిద్ధమయ్యామని అంటున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
దర్శకుడిగా తాను, హీరోగా తేజ చిన్న వాళ్ళమే అని.. సంక్రాంతికి రావడానికి తమకు పెద్ద పెద్ద స్టార్స్ లేరని.. తమకు ఉన్న ఒకే ఒక్క స్టార్ హనుమాన్ అందుకే నమ్మకంతోనే సంక్రాంతికి వస్తున్నామని.. తాము చిన్న వాళ్ళమే అయినా తమ సినిమా కంటెంట్ పెద్దదని హనుమాన్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ప్రశాంత్ వర్మ తెలిపాడు.
ఇక జనవరి 12న గుంటూరు కారంతో పోటీ గురించి మాట్లాడుతూ.. ఈ డేట్ ముందుగా ప్రకటించింది తామే అని, చాలా ముందుగానే ఆ డేట్ తోనే నార్త్ ఇండియా అంతటా అగ్రిమెంట్లు కూడా జరిగిపోయాయని.. కాబట్టి కచ్చితంగా 12నే తమ సినిమాను రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రశాంత్ చెప్పాడు. హీరో మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తమ ఫేవరెట్ అని.. కాబట్టి జనవరి 12న గుంటూరు కారం ఫస్ట్ షో తామూ చూస్తామని ప్రశాంత్ అన్నాడు.
మరోవైపు ఆదిపురుష్ సినిమా తర్వాత హనుమాన్ విషయంలో ఒత్తిడి పెరిగిందా అని విలేకరులు అడగ్గా.. అలాంటిదేమీ లేదని, తన సినిమా టీజర్ వైరల్ అయ్యాక కూడా ఎంత మాత్రం ప్రెజర్ ఫీల్ కాలేదని.. తాను ముందు నుంచి ఎలా అనుకున్నానో అలాగే సినిమా తీశానని ప్రశాంత్ వర్మ తెలిపాడు.